– ప్రపంచమంతా ఒకటేనని భారత్ చెబుతుంది
– ప్రతీ ఒక్కరిని ఆర్యులుగా చేస్తాం
– హిందూ సంప్రదాయాలన్నీ ధర్మానికి ఉదాహరణలు
– ప్రపంచం సవ్యమైన మార్గంలో నడవడం లేదు
– ఒకరిపై ఒకరు ఆధిపత్యం తగదు
– శాంతి, సామరస్యం కావాలంటే భారత్ తో అనుబంధం అవసరం
– వరల్డ్ హిందూ కాంగ్రెస్- 2023లో ఆర్ఎస్ఎస్ చీఫ్
హిందూ ధర్మం గురించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం అని అన్నారు. ప్రతి ఒక్కరినీ ఆర్యులుగా చేస్తామని వెల్లడించారు. అదే సంస్కృతి అని తెలిపారు. ఇక్కడ సంస్కృతి అనే పదం సరిపోదన్నారు. కానీ, మెరుగైన సమాజం కోసం తాను ఈ పదాన్ని ఉపయోగించాల్సి వచ్చిందని చెప్పారు. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో నిర్వహించిన ‘వరల్డ్ హిందూ కాంగ్రెస్- 2023’ లో మోహన్ భగవత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేధోపరమైన విభేదాలు ఉన్నప్పటికీ మన హిందూ సంప్రదాయాలన్నీ ధర్మానికి ఉదాహరణలు అని చెప్పారు. క్రమశిక్షణను పాటించేందుకు గాను దేశంలోని సాంప్రదాయాలన్నింటినీ శుద్ధి చేయాల్సి ఉందన్నారు. మనం ప్రతి చోటుకీ వెళ్తామని, అక్కడ ప్రతి ఒక్కరి హృదయాలను స్పృశిస్తామని, వాళ్లు అంగీకరించినా, అంగీకరించకపోయినా మనం మాత్రం అందరితో కనెక్ట్ కావాల్సి ఉంటుందని తెలిపారు.
ఇప్పుడు సకల సౌఖ్యాలు పొందినప్పటికీ ఈ ప్రపంచం పూర్తిగా సంతృప్తి చెందడం లేదన్నారు. నేటి ప్రపంచం సవ్యమైన మార్గంలో నడవడం లేదన్న ఆయన.. 2000 ఏండ్లుగా శాంతి, సంతోషం తీసుకు వచ్చేందుకు ఈ ప్రపంచం చాలా వరకు ప్రయోగాలు చేసిందని చెప్పారు. అందరూ కూడా భౌతికవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానాన్ని ఉపయోగించడంతో పాటు వివిధ మతాలను ప్రయత్నించి తమ శ్రేయస్సు పొందారు కానీ ఇప్పటికీ భౌతిక సుఖాలు ఉన్నప్పటికీ ప్రజలు సంతోషంగా లేరన్నారు.
ప్రజలు ఇప్పుడు భౌతిక సౌఖ్యాన్ని పొందేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దీని కోసం ఒకరితో ఒకరు పోట్లాడుతున్నారని.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తున్నారన్నారు. ఇదంతా మనం చేస్తూనే ఉన్నామని.. ఇది సరికాదని సూచించారు. మనం అసుర విజయాన్ని కూడా అనుభవించామని అన్నారు.
కొవిడ్ తర్వాత ఈ ప్రపంచం పునరాలోచించడం మొదలు పెట్టిందన్న ఆయన.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచానికి ఇప్పుడు భారత్ ఓ మార్గాన్ని చూపిస్తోందన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమని భారత్ చెబుతోందని.. కొన్ని నెలల క్రితం ప్రపంచ ముస్లిం కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి భారతదేశానికి వచ్చారని గుర్తు చేశారు. ప్రపంచంలో శాంతి, సామరస్యం కావాలంటే భారత్ తో అనుబంధం అవసరమని అన్నారు మోహన్ భగవత్.