ఉత్తర కాశీలో 17 రోజుల పాటు అలు పెరగని పోరాటం చేసి టన్నెల్ (Tunnel) నుంచి 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చిన రెస్క్యూ టీమ్ (Rescue Team) పై ప్రశంసల వర్షం కురుస్తోంది. గత 17 రోజులుగా టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్య్యూ టీమ్ చేసిన ప్రయత్నాలను ప్రధాని మోడీ అభినందించారు.
టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులకు తాను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానన్నారు. కార్మికుల ధైర్యం, సహనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చిందన్నారు. కార్మికులంతా మంచి ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కార్మికులు వారి కుటుంబ సభ్యులను కలుసుకోవడం సంతృప్తి కలిగించే విషయమన్నారు.
మరోవైపు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా రెస్య్యూ సిబ్బంది ప్రయత్నాలను అభినందించారు. ఉత్తర కాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో గత 17 రోజులుగా జీవన్మరణ పోరాటం చేసిన కూలీలందరూ సురక్షితంగా బయటపడ్డారని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన ప్రతి ఒక్క ధైర్యవంతునికి సెల్యూట్ అని తెలిపారు. యావత్ దేశ ప్రార్థనలను విజయవంతం చేశారన్నారు. కార్మిక సోదరులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులను 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారని పేర్కొన్నారు. శ్రామికుల ధృఢత్వానికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందన్నారు. మొత్తం రెస్క్యూ టీమ్ ప్రదర్శించిన అంకితభావం, నైపుణ్యం పట్టుదలను దేశం మెచ్చుకుంటోందన్నారు.
టన్నెల్ నుంచి 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకు రావడం వెనుక ఉన్న రెస్క్యూ టీమ్‌కు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కృతజ్ఞతలు తెలిపారు. ఈ 41 విలువైన ప్రాణాలను కాపాడేందుకు గత 17 రోజులుగా అవిశ్రాంతంగా పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపారు. అటు బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా రెస్క్యూ టీమ్ ను అభినందించారు.