భారత్ కు చెందిన ప్రముఖ కంపెనీల్లో కే అండ్ ఆర్ రైల్ ఇంజనీరింగ్ (K&R Rail Engineering) ఒకటి. ఈ సంస్థ దేశంలోని పలు రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టులు చేసింది. తాజాగా కే అండ్ ఆర్ కంపెనీ ప్రతినిధులు మొనాకోలో పర్యటిస్తున్నారు. కంపెనీ ప్రతినిధులకు మొనాకోలో ఘన స్వాగతం లభించింది.
భారత్ లో మొనాకో రాయబారి డిడియర్ గేర్డింగర్.. కే అండ్ ఆర్ కంపెనీ బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా దేశంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కంపెనీ బృందం పరిశీలించనుంది. దీంతో పాటు పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయి వివిధ అంశాలపై వారితో చర్చించనున్నారు.
బ్యాంకులు, ఇన్వెస్ట్ మెంట్ ప్రొఫెషనల్స్, పలు సంస్థల ప్రతినిధులతో కే అండ్ ఆర్ కంపెనీ ప్రతినిధులు సమావేశం అవుతారని మొనాకో అధికారులు తెలిపారు. ఇరు దేశాల మధ్య సానుకూల ఆర్థిక సంబంధాలను నెలకొల్పేందుకు ఈ చర్చలు జరుగుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ చర్చలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తాము భావిస్తున్నట్టు మోనాకో ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కే అండ్ ఆర్ కంపెనీ ప్రతినిధుల బృందంతో దిగిన ఫోటోలను షేర్ చేసింది.