బాలకృష్ణ (Balakrishna) ఎప్పుడూ ఇంత యాక్టివ్ గా కనిపించలేదని, చంద్రబాబు (Chandrababu) కళ్లలో ఆనందం చూడటం కోసమే అసెంబ్లీలో బాలకృష్ణ ఇంత హడావిడి చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని, ప్రాపర్ ఫార్మెట్ తో వస్తే చంద్రబాబు అరెస్ట్ పై అసెంబ్లీ (AP Assembly) లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
ఏ అంశమైనా చర్చించేందుకు అసెంబ్లీ ఒక చక్కని వేదికని, దీనిని టీడీపీ సభ్యులు ఉపయోగించుకోవాలని అంబటి సూచించారు. పారిపోకుండా చర్చలో పాల్గొనాలని కోరారు. బావ కళ్లలో ఆనందం కోసం బాలకృష్ణ ఫుల్ యాక్టివ్ అయ్యారని అన్నారు. మీసాలు మీ పార్టీలో తిప్పండి, అసెంబ్లీలో కాదని బాలకృష్ణకు సూచించారు. తండ్రి వెన్నులో కత్తి దింపిన సంగతి గుర్తు చేసుకుని, పార్టీ పగ్గాలు అందిపుచ్చుకోవాలని బాలకృష్ణను కోరారు.
మీకు నాయకత్వ లక్షణాలున్నాయి, మీ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకోండని, పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఇదే మంచి అవకాశమని బాలకృష్ణకు అంబటి రాంబాబు సూచించారు. చంద్రబాబు అరెస్ట్ పై సభను గందరగోళ పరిచే కంటే…చర్చకు వస్తే చర్చిద్దామని అంబటి టీడీపీ సభ్యులకు సూచించారు. గందరగోళం చేయాలంటే తాము చేయగలమని అన్నారు.
సభలో అనుచిత వ్యాఖ్యలు, చేష్టలు చేస్తున్నారని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి టీడీపీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. కూర్చుని చర్చించుకుద్దామంటే వినకుండా సభలో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని కాకాణి అన్నారు. చంద్రబాబు దోచుకోలేదని చెప్పకుండా, అసెంబ్లీలో అల్లరి చేసి డిస్టర్బ్ చేయలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో బాలకృష్ణ సిగ్గులేని పనులు చేస్తున్నారని విమర్శించారు. అలా చేసినందుకు బాలకృష్ణ సిగ్గుపడాలన్నారు.