టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు (Ambati Tirupati Rayudu) మళ్లీ మనసు మార్చుకున్నారు. ఇటీవలే వైసీపీ (YCP) లో చేరి పది రోజుల్లోనే గుడ్ బై చెప్పిన ఆయన.. దుబాయ్ లో క్రికెట్ లీగ్ లు ఉన్నాయని.. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే.. సడెన్ గా హైదరాబాద్ (Hyderabad) లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో భేటీ అయ్యారు. దీంతో ఆపార్టీలోకి వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
సీఎం జగన్ (CM Jagan) సమక్షంలో గత డిసెంబర్ 28న వైసీపీలో చేరారు రాయుడు. ఆ సమయంలో జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన అవకాశమిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే.. కరెక్ట్ గా పది రోజులు తిరక్కుండానే.. వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. తాను వైసీపీని వీడుతున్నట్టు వెల్లడించారు. ‘వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా’ అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు రాయుడు.
ఈ నెల 20 నుంచి దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ-20లో ఎంఐ ఎమిరెట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నానని వెల్లడించారు. తన ప్రొఫెషనల్ ఆట కొనసాగించేందుకు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్ తో రాయుడు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.
చాలా రోజులుగా జగన్ పాలనపై ప్రశంసలు కురిపిస్తూ వచ్చారు రాయుడు. ఈయన సొంత ఊరు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు. ఈ నేపథ్యంలో వైసీపీ తరఫున గుంటూరు ఎంపీ స్థానం నుంచి బరిలో దిగుతారని వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టే ఆయన కొన్నాళ్లు గ్రామాల్లో పర్యటిస్తూ వచ్చారు. పలువురు విద్యార్థులకు సాయం చేశారు. అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. చివరకు ఆయనే వైసీపీ రాజకీయాలకు రిటైర్డ్ హర్ట్ ప్రకటించారు. ఇప్పుడు జనసేన గూటికి చేరుతున్నట్టు తెలుస్తోంది.