డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar).. బహుముఖ ప్రజ్ఞాశాలి. అణగారిన వర్గాల ఆత్మబంధువు. కుల వ్యవస్థ లేని సాంఘిక వ్యవస్థ ఏర్పాటుకు దారి చూపిన గొప్ప దార్శనికుడు. అణగారిన, వెనుకబడిన జాతులకు రాజ్యాధికారం కల్పించే దిశగా అహర్నిశలు ప్రయత్నించిన మేధావి.
రాజ్యాంగం అనే పవిత్రమైన గ్రంథాన్ని అందజేసిన గొప్ప వ్యక్తి. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ లో జన్మించారు అంబేద్కర్. అసలు పేరు భీమ్ రావ్ రామ్ జీ అంబేద్కర్. దళిత వర్గానికి చెందిన ఈయన చిన్నతనం నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. పాఠశాలలో కూడా విద్యార్థులకు దూరంగా కూర్చొబెట్టే వారు.
ఈ అంటరానితనానికి ముగింపు పలకాలని అప్పుడే ఆయన బలంగా నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడుతూ.. ఉన్నత విద్యలు చదివి.. అంచెలంచెలుగా ఎదిగారు. 64 సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేశారు. హిందీ, పాలీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఇలా పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.
ఒక రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా, ఆర్థిక వేత్తగా, న్యాయవాదిగా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత భారత రాజ్యాంగ రచనా సంఘానికి నాయకత్వం వహించారు. వెనుకబడిన, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు, ప్రత్యేక అవకాశాలు కల్పించి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత నాయకుడు బీఆర్ అంబేద్కర్.