భారత్-కెనడాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తింటున్న నేపథ్యంలో ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా కెనడా (Canada) లో ఖలిస్తాన్ (Khalisthan) ఉగ్ర సంస్థ చీఫ్ లతో అక్కడే మకాం వేసిన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ఐ (ISI) భేటీ అయినట్టు తెలుస్తోంది. వాంకోవర్ లో ఈ రెండు వర్గాల మధ్య రహస్య భేటీ జరిగినట్టు నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది.
సుమారు ఐదు రోజుల క్రితం ఈ సమావేశం జరిగినట్టు సమాచారం. ఈ సమావేశానికి ఖలిస్తాన్ ఉగ్ర గ్రూపు కీలక నేతలు హాజరయ్యారు. ఇందులో సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) చీఫ్ గుర్పత్‌వంత్ సింగ్ పన్నున్, ఖలిస్తానీ సంస్ధల ఇతర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది. భారత్ పై వ్యతిరేక ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం.
ఇక ఇప్పటికే కొన్ని నెలలుగా ఖలిస్తాన్ కు ఐఎస్ఐ నిధులు సమకూరుస్తున్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ నిధులను భారత వ్యతిరేక ప్రచారంలో ఖలిస్తాన్ గ్రూపు సభ్యులు వాడుకుంటున్నట్టు పేర్కొన్నాయి. ఇది ఇలా వుంటే కెనడా ప్రధాని ట్రూడో ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం వుందని ఆయన ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. కెనడా ప్రధాని వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్దమైనవని భారత్ పేర్కొంది. ఈ మేరకు భారత్ లో కెనడా రాయభారిని బహిష్కరిస్తున్నట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఐదు రోజుల్లోగా భారత్ విడిచి వెళ్లిపోవాలని కెనడా రాయభారికి భారత్ సూచించింది. తాజాగా సెప్టెంబర్ 21 నుంచి తదుపరి ఆదేశాలు వెలుపడే వరకు భారతీయ వీసా సేవలు నిలిచిపోయాయని కెనడియన్ల వీసా దరఖాస్తులను పరిశీలించేందుకు నియమించిన ప్రైవేట్ ఏజెన్సీ బీఎల్ఎస్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.