కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)పై కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దివంగత మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూపై అమిత్ షా వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కేంద్ర హోం మంత్రికి భారత చరిత్ర గురించి తెలియదంటూ విమర్శలు చేశారు. చరిత్రను ఎప్పటికప్పుడు అమిత్ షా పునర్ లిఖిస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు.
పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ…. జవహర్ లాల్ నెహ్రూ ఒక గొప్ప నేత అని అన్నారు. నెహ్రూ తన జీవితాన్ని ఈ దేశం కోసం అంకితం చేశారని తెలిపారు. కొన్నేండ్ల పాటు నెహ్రూ జైలులో ఉన్నారని వెల్లడించారు. అమిత్ షాకు చరిత్ర తెలియదన్నారు. చరిత్రను తిరగరాస్తున్నందున అమిత్ షాకు చరిత్ర తెలుసని తాను భావించనన్నారు.
దేశంలో కుల గణన జరపాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు దానిపై చర్చించలేదని ఆరోపించారు. కుల గణన వంటి నిరంతర సమస్యల నుండి దేశం దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. దేశంలో డబ్బు మొత్తం ఎవరి చేతుల్లోకి వెళుతుందనేది ఇప్పుడు అసలు విషయం అని పేర్కొన్నారు.
ఈ సమస్యపై చర్చించేందుకు బీజేపీ నేతలు ఇష్టపడరని తెలిపారు. వారు దానిపై చర్చ నుంచి భయపడి పారిపోయారని చెప్పారు. తాము ఈ సమస్యను ముందుకు తీసుకెళ్తామన్నారు. పేద ప్రజలు తమ హక్కులు పొందేలా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. సంస్థాగత వ్యవస్థలో ఓబీసీలు, దళితులు, గిరిజనుల భాగస్వామ్యం గురించి తాను ప్రశ్నించానన్నారు. ఈ సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జవహర్లాల్ నెహ్రూ తదితరుల గురించి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు.