పార్లమెంట్ (Parliament)లో స్మోక్ అటాక్ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు. ఈ ఘటనపై ప్రతిపక్షాల తీరును ఆయన తప్పుబట్టారు. ఇది చాలా సీరియస్ విషయమని తెలిపారు. ఈ విషయంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. భద్రతా లోపం వాస్తవమేనన్నారు. పార్లమెంట్లో భద్రతా అనేది స్పీకర్ ఆధ్వర్యంలో కొనసాగుతుందని అందరికీ తెలుసన్నారు.
భద్రతా పరమైన లోపాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు స్పీకర్ లేఖ రాశారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. విచారణ అనంతరం దీనిపై స్పీకర్ కు నివేదిక పంపిస్తామని చెప్పారు. భద్రతా ఉల్లంఘన ఘటనపై దర్యాప్తు చేయడంతోపాటు లోక్సభ భద్రతను పెంచే బాధ్యతను కమిటీకి అప్పగించామని అమిత్ షా వెల్లడించారు.
భద్రతా పరమైన లోపాలు వాస్తవేమనని షా అన్నారు. వాటన్నింటినీ సరిచేయడమే తమ కర్తవ్యమన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయకూడదని విపక్షాలను కోరుతున్నానన్నారు. పార్లమెంట్ లో బుధవారం భద్రతాపరమైన లోపం కనిపించింది. లోక్ సభ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు సభలోకి దూసుకు వెళ్లారు. స్మోక్ క్యాన్స్ తో వెళ్లిన ఆ వ్యక్తులను ఎంపీలు పట్టుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా ప్రధాన ప్రధాన సూత్రధారి లలిత్ ఝా పోలీసులకు లొంగిపోయాడు. కర్తవ్యపధ్ పోలీసు స్టేషన్లో నిందితుడు లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.