లోక్ సభ (Loka Sabha) లో మహిళా బిల్లు (Woman Reservation Bill) పై చర్చ సందర్బంగా బీజేపీ ,కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. దేశంలో భారత ప్రభుత్వం కింద పని చేసే 90 మందిలో కేవలం నలుగురే ఓబీసీలు వున్నారంటూ రాహుల్ గాంధీ ఎత్తి చూపారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహిళా బిల్లు విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు.
మహిళా రిజర్వేషన్ గురించి చర్చ సందర్బంగా కులగణన విషయాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావనకు తెచ్చారు. మహిళా బిల్లును వెంటనే ఆమోదించాలని, దేశంలో కుల గణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో పరిపాలన విభాగాల్లో ఓబీసీలకు కేంద్రం ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తుందనే అంశాన్ని సభలో రాహుల్ గాంధీ లేవనెత్తారు.
భారత ప్రభుత్వం కింద మొత్తం 90 మంది కార్యదర్శులు పని చేస్తుండగా అందులో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీలు వున్నారనే విషయం తెలుసుకుని తాను విస్మయానికి గురైనట్టు రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు ఎంత మంది వున్నారో తెలియాలంటే కుల గణన ద్వారా మాత్రమే తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశాన్ని సెక్రటరీలు నడిపిస్తారన్న భావనలు కొందరు వున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి దేశాన్ని నడిపించేంది ప్రభుత్వమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో 85 బీజేపీ ఎంపీలు, 29 మంది మంత్రులు ఓబీసీ వర్గాలకు చెందిన వారేనన్నారు. ఓబీసీల కోసం మాట్లాడుతున్నామని చెప్పుకునే వాళ్లు… ఓబీసీ వర్గానికి చెందిన నేతను ప్రధానిగా చేసింది బీజేపీనే అని గుర్తుంచుకోవాలన్నారు.
మహిళా సాధికారత అనేది విషయం బహుశా ప్రతిపక్షాలకు రాజకీయ ఎజెండా అయితే కావచ్చు గానీ బీజేపీకి మాత్రం కాదన్నారు. 2024 ఎన్నికల అనంతరం నూతన ప్రభుత్వం జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియను నిర్వహిస్తుందన్నారు. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రక్రియను ఆ ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.