కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్‌లో (Rajasthan) ఆయన ఎన్నికల ప్రచార రథం ఓ విద్యుత్ తీగకు తాకింది. దీంతో వెంటనే నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. ఆ తర్వాత వైరు తెగిపోయింది. దీంతో వెంటనే విద్యుత్‌ను నిలిపి వేశారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
శాసన సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజస్థాన్‌లోని నాగౌర్‌లో పర్యటించారు. అక్కడ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. బిదియాద్ గ్రామం నుంచి పర్ బస్తార్ కు ఎన్నికల ప్రచారం కోసం వెళుతుండగా ఆయన ప్రచార రథం పై భాగం విద్యుత్ తీగను తాకింది.
వెంటనే నిప్పు రవ్వలు ఎగసి పడ్డాయి. దీంతో ఒక్క సారిగా బీజేపీ నేతలు కంగారు పడ్డారు. వెంటనే తేరుకుని అమిత్ షా ప్రచార రథాన్ని నిర్వాహకులు వెంటనే ఆపివేశారు. విద్యుత్‌ను నిలిపి వేసి వెంటనే మరమ్మతులు చేపట్టారు. వెంటనే అమిత్ షాను వెరొక ప్రచార రథంలో ఎక్కించి ప్రచారాన్ని కొనసాగించారు.
అనంతరం కుచమాన్, మక్రానా, నాగౌర్ ప్రాంతాల్లో ఆయన ప్రసంగించారు. ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్టు వెల్లడించారు.