పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్(BRS) పార్టీకి ఊహించని విధంగా షాకులు తగులుతున్నాయి.ఇటీవల కాలంలో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్, బీజేపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారని వినికిడి.
పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఆశించిన విధంగా సీట్లు రాకపోతే వారు కూడా హస్తం పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్దమయినట్లు టాక్ వినిపిస్తోంది.తాజా పరిస్థితులు బీఆర్ఎస్ నాయకత్వానికి పెను భారంగా మారాయి. ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు మరోవైపు నేతల వలసలను హ్యాండిల్ చేయడంలో అధినేత కేసీఆర్ ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి (Gutta amith reddy) కాంగ్రెస్ పార్టీలో(JOin in congress) చేరాడు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని అమిత్ రెడ్డి కలిశారు.ఈ సందర్బంగా సీఎం రేవంత్ అమిత్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గుత్తా అమిత్ రెడ్డి నల్గొండ లేదా భువనగిరి స్థానాల్లో బీఆర్ఎస్ నుంచి ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే, నల్గొండ నుంచి అవకాశం కల్పిస్తే పోటీ చేస్తానని సిద్ధమయ్యారు. కానీ లోకల్ లీడర్స్ అడ్డుతగలడంతో అది సాధ్యంకాలేదు. దీంతో గుత్తా అమిత్ రెడ్డి సందిగ్ధంలో పడిపోయారు. అయితే, స్థానిక పార్టీ నేతలు సహకరించనప్పుడు పోటీ చేయాల్సిన అవసరం తనకు లేదని బీఆర్ఎస్ అధిష్టానానికి అమిత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.ఈ పరిణామాల అనంతరం అకస్మాత్తుగా గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.