అనంత లక్ష్మణ్ కన్హారే…. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా బిగిసిన ఉక్కు పిడికిలి ఆయన. భారతీయులపై తెల్ల దొరల దురాగతాలకు వ్యతిరేకంగా రగిలిన నిప్పు కణిక . ఆంగ్లేయాధికారిని జాన్సన్ ను మట్టు పెట్టిన విప్లవ పోరాట యోధుడు. హిందువులను చులకనగా చూసే వారికి జాక్సన్ కు పట్టిన గతే పడుతుందని న్యాయస్థానంలో బ్రిటీష్ వారిని హెచ్చరించిన హిందూ సింహం ఆయన.
7 జనవరి 1892న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తాలూకాలో అంజనీ అనే ఓ చిన్న గ్రామంలో అనంత్ కాన్హారే జన్మించారు. ప్రాథమిక విద్యను ఇండోర్ లోనూ, సెకండరీ విద్యను ఔరంగబాద్ లో పూర్తి చేశారు. 1908లో ఔరంగాబాద్‌లో గంగా రామ్ రూప చంద్ ష్రాఫ్ ఇంట్లో ఓ గది అద్దెకు తీసుకున్నాడు. అక్కడ గంగారామ్ స్నేహితుడు తోంపేతో పరిచయం ఏర్పడింది.
తోంపే నాసిక్ రహస్య విప్లవ సంఘంలో సభ్యుడిగా ఉండేవారు. ఆ తర్వాత తోంపే, గంగా రామ్‌ల వల్ల అనంత కన్హారేకు విప్లవ సంఘాలతో అనుబంధం ఏర్పడింది. క్రమక్రమంగా విప్లవ సంఘాల వైపు ఆకర్షితుడయ్యారు. ఆ సమయంలో సావర్కర్ సోదరులు ఏర్పాటు చేసిన ‘అభినవ భారత్’విప్లవ సంస్థకు గొప్ప పేరు ఉండేది. నాసిక్ కలెక్టర్ జాన్సన్ దురాగతలను సహించలేక ఆ అధికారిని హతమార్చాలని అభినవ భారత్ నిర్ణయించింది.
ఇక అప్పటికే సావర్కర్ సోదరుల నుంచి స్ఫూర్తి పొందిన అనంత కన్హారే ఆ పనిని పూర్తి చేయాలనుకున్నారు. కానీ అప్పటికే జాన్సన్ కు ముంబై కమిషనర్‌గా పదోన్నతి లభించింది. దీంతో ఆయనకు విజయానంద్ థియేటర్ వద్ద వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. నాటకాన్ని చూడటానికి వచ్చిన జాన్సన్ పై అనంత్ కన్హారే నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో జాన్సన్ నేలకొరిగాడు. అనంతరం అనంత కన్హారేకు మరణ శిక్ష విధించారు.