అమరావతి: జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు ముఖ్య నేతలు,కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సంధర్భంగా పవన్ మాట్లాడుతూ ఏపీలో రికార్డ్ స్థాయిలో ఉమెన్ ట్రాఫ్కింగ్ (Women Trafficking) జరుగతుంటే ఒక్క మంత్రి కూడా మాట్లాడటం లేదని జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
అసలు మహిళ కన్నీరు తుడవలేని ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమేనా.151 స్థానాలు ఇచ్చి ప్రయోజనం ఏంటి!? అంటూ మండిపడ్డారు.మహిళలపై దాడులను గవర్నమెంటు ఎందుకు నియంత్రించలేక పోతోందన్నారు.జగన్ పాలన అస్తవ్యస్తంగా ఉందని, అనేక మంది ఏపీ రాష్ట్రం వదిలి వెళ్లిపోతామని అంటున్నారు.. ఎక్కడకని పారిపోతాం, ఎంతవరకు వెళతాం.. అన్నిచోట్లా బెదిరింపులు ఉంటాయన్నారు.
ఈ నేల మనది… ఎన్ని అడ్డంకులు అయినా నిలబడాలన్నారు. రాజ్యాంగం(Constitution)కల్పించిన హక్కును ఎవడో కాలరాస్తే చూస్తూ ఊరుకుంటామా? అని అన్నారు. శ్రీలక్ష్మి, అయేషా, దిశ, నిర్భయ, సుగాలి ప్రీతి కేసులను చూడాలన్నారు. మన హక్కులను సాధించుకోవడం కోసం పోరాటం చేయాలని, కుల, మతాలకు అతీతంగా మనకు రాజ్యాంగం రక్షణ కల్పించిందని, లౌకిక రాజ్యం(secular state)లో అన్ని మతాలు సమానమేనని అన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్ లాగా ఫ్యూడలిజం అంటే సాధ్యం కాదని, వ్యవస్థలను నాశనం చేసేవారు సిఎంగా ఉంటే మనం ఎదురు తిరగాలని పవన్ పిలుపిచ్చారు. చట్టం అందరికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించిందని, భావ స్వేచ్చ ప్రకటన అనేది ప్రజల హక్కన్నారు.
స్త్రీలు తలచుకుంటే సాధించనిది ఏమీ ఉండదని, సమాజంలో మహిళలే మార్పులు తీసుకురాగలరని, స్త్రీలంతా ధైర్యంగా నిలబడితే.. మార్పు తీసుకొద్దామని అన్నారు. ఈ హక్కులకు భంగం కలిగించేలా పాలకుల తీరు ఉందని మండిపడ్డారు.
యదేచ్ఛగా ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంటే ఒక్క మంత్రీ మాట్లాడడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీ ప్రజల సంరక్షణ చేసే చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమ్మ ఒడి, ఇతర పధకాలు రాజ్యాంగం కల్పించిన హక్కని, జగన్ ఇచ్చిన హక్కు కాదనేది తెలుసుకోవాలని పవన్ అన్నారు. రిషికొండ, చెరువుల కబ్జాలు జరుగుతున్నాయని, వైసీపీ ప్రభుత్వం నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదని విమర్శించారు.
ఇసుక, మైనింగ్(Mining) దోచేయడం రాజ్యాంగ విరుద్దని, సీఎం జగన్ ప్రాధమిక బాధ్యతలను పూర్తిగా మరచిపోయారన్నారు. ఆ వ్యక్తిపై 30 కేసులు ఉంటే… కోర్టులను కూడా దూషిస్తారని, హైకోర్టు,సుప్రీంకోర్టులను కూడా తప్పు పట్టే స్థాయికి వెళ్లిపోయారన్నారు. సమాజంలో మార్పు రావాలని…భవిష్యత్తు తరాల గురించి ఆలోచన చేయాలన్నారు.
అబద్దాలు చెప్పే వ్యక్తిని సిఎంగా ఎన్నుకుంటే ఏం జరిగిందో అందరం చూశామని, ఈ ఐదేళ్లల్లో రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేసే వారిని ఎన్నుకోవాలని, తనతో సహా అందరినీ పరిశీలించాలని, పని తీరు అధ్యయనం చేయాలన్నారు. పోరాటం చేసే పటిమను పిల్లలకు నేర్పాలని ప్రతి తల్లిని కోరుతున్నానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.