ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ (Skill Development) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) వేసిన క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై చంద్రబాబు, సీఐడీ తరఫు న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ లో పెడుతున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు.
మొత్తం సుమారు 5 గంటల పాటు ఈ పిటిషన్ పై ఈరోజు వాదనలు జరిగాయి. మొదట 12 గంటల నుంచి 1.45 గంటల వరకు చంద్రబాబు తరఫున న్యాయవాదులు సిద్ధార్థ లూద్రా, హరీశ్ సాల్వే లు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా సీఐడీ వ్యవహరించిన తీరును చంద్రబాబు తరఫు న్యాయవాదులు తప్పుబట్టారు.
చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీ తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తోందని ఆరోపించారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇదంతా చేసిందని ఆరోపించారు. రెండేండ్ల క్రితం నమోదైన ఎఫ్ఐఆర్ తో చంద్రబాను ఎలా అరెస్టు చేస్తారంటూ ఆయన తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. పైగా గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఆయన్ని అరెస్టు చేశారని వాదనలు వినిపించారు.
అనంతరం సీఐడీ తరఫు న్యాయవాదులు ప్రతి వాదనలు చేశారు. క్వాష్ పిటిషన్ కు చంద్రబాబు అనర్హుడని సీఐడీ తరఫున ముకుల్ రోహిత్గీ వాదించారు. ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే చంద్రబాబును అరెస్టు చేయలేదని, ఈ కేసులో రెండేండ్ల విచారణ జరిపి అన్ని సాక్ష్యాలు సేకరించిన తర్వాతే ఆయన్ని అరెస్టు చేశామన్నారు.
రూ. 3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో తేల్చాల్సి వుందన్నారు. డొల్ల కంపెనీల గురించి దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇందులో నిబంధనలకు వ్యతిరేకంగా ఎంవోయూ నుంచి సబ్ కాంట్రాక్ట్‌కు ఎలా వెళ్లింది? అని నిలదీశారు. అన్ని షెల్ కంపెనీలు కలిసి ప్రజాధనాన్ని దోచుకున్నాయమని చెప్పారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. ఇక సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా దాఖలు చేయవచ్చన్నారు.
మరోవైపు చంద్రబాబుపై సీఐడీ పిటీ వారంట్ దాఖలు చేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కోంటూ ఏసీబీ కోర్టులో పీటీ వారంట్ ను వేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ టెరాసాఫ్ట్ అనే కంపెనీకి ఫైబర్ నెట్ కాంట్రాక్టు ఇచ్చారని వారెంట్ లో సీఐడీ అభియోగాలు మోపింది. 2021లో ఫైబర్ నెట్ కేసు నమోదు చేసిన సీఐడీ మొత్తం 19 మందిపై అభియోగాలు మోపింది.
టెండర్లు లేకుండానే టెరాసాఫ్ట్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారని అభియోగాలు చేసింది. టెరాసాఫ్ట్ కు రూ. 121కోట్ల రూపాయల మేర లాభాన్ని అప్పటి టీడీపీ సర్కార్ కలిగించిందని పిట్ వారంట్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. అనతంరం విచారణను రేపటికి వాయిదా వేసింది.