డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీలు (Anganwadi Workers) కదం తొక్కారు. కనీసం వేతనం కోసం తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించారు. దీంతో పలు జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
సిరిసిల్ల (Sircilla) కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేశారు అంగన్వాడీలు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కించాలని డిమాండ్ చేశారు. వీరికి అఖిలపక్ష నేతలు మద్దతు తెలిపారు. బారీకేడ్లు దాటుకుని కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు.
వికారాబాద్ (Vikarabad) కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి పెద్దఎత్తున తరలి వచ్చారు. గతంలో 1వ తేదీన జీతాలు వచ్చేవని.. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొందని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరించారు.
ఆదిలాబాద్ (Adilabad) కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అంగన్వాడీలు, హెల్పర్లు 10 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కలెక్టరేట్ మట్టడికి యత్నించారు. వీరికి సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు. అయితే.. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళా ఎస్సై కిందపడిపోయారు. ఆమెకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిరసనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు.
కనీస వేతనం రూ.25 వేలతోపాటు ఇతర సమస్యల పరిస్కారం కోసం సమ్మె చేస్తుంటే.. ప్రభుత్వం పట్టించుకోకపోగా పోలీసులతో అణచివేస్తోందని మండిపడ్డారు అంగన్వాడీలు. అరెస్టులతో ఉద్యమాలను అణిచివేసేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందని అగ్రహం వ్యక్తం చేశారు.