పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్(BRS) పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి(Ex Minister Peddireddy) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా(Resign to Brs party) చేసి, బీజేపీ చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆదివారం బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ను మాజీమంత్రి పెద్దిరెడ్డి కలిశారు. బీజేపీలో చేరాలని వారు ఆహ్వానించగా.. అందుకు పెద్దిరెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
రెండ్రోజుల్లో బీజేపీలో చేరికకు సంబంధించి అధికారికంగా ప్రకటన రానున్నట్లు సమాచారం. అయితే, 1994, 1999లో జరిగిన ఎన్నికల్లో పెద్దిరెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ గుర్తుపై రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1999-2004 మధ్య నారా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో కార్మిక, సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. పెద్దిరెడ్డికి కార్మిక నాయకుడిగా మంచి పేరుంది.
గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోనూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి పనిచేసిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ బలహీనం అవ్వడంతో కేసీఆర్ పిలుపుమేరకు బీఆర్ఎస్ చేరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రిగా పనిచేసిన తనకు బీఆర్ఎస్ పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యత దక్కలేదని, కేసీఆర్ కూడా పట్టించుకోవడం లేదని ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు పెద్దిరెడ్డి ప్రకటించారు.