రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తెలంగాణ అప్పుల కుప్పగా మారడానికి మీరే కారణం అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తుంటే.. ప్రస్తుతం కరువు పరిస్థితులు ఏర్పడటానికి, రైతుల ఆత్మహత్యలకు, పంట పొలాలు ఎండిపోవడానికి సోయి లేని కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కారణమని బీఆర్ఎస్(BRS) నేతలు విమర్శిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల అటెన్షన్ కోసం పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల్లో ఏ పార్టీకి ప్లస్ అవుతుంది? ఏ పార్టీకి మైనస్ అవుతుందనే విషయం పక్కనబెడితే వీరి తిట్ల పురాణానికి ప్రజలు సైతం నివ్వెరపోతున్నారు.
తాజాగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (HarishRao) సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth reddy)కి మరోసారి బహిరంగ లేఖ(Letter) రాశారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.2లక్షల హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఒకేవిడతలో రుణమాఫీ చేస్తానని చెప్పారు. మాఫీ చేశాక మళ్లీ 2 లక్షల రుణం తీసుకోవాలని రేవంత్ చెప్పిన మాటలను హరీశ్ రావు గుర్తుచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు రుణమాఫీ జరగలేదని విమర్శించారు. మీరు రుణమాఫీ చేయని కారణంగా బ్యాంకుల నుంచి రైతులకు నోటీసులు వస్తున్నాయని, రూ.2లక్షల రుణమాఫీ ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలని హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రతి ఎకరానికి రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. ఎకరానికి రూ.15వేల చొప్పున రైతు పెట్టుబడి సాయం ఇవ్వాలని, సాగునీరు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని లేఖలో కోరారు.