ఉప రాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్ ఖర్ (Jagdeep Dhankhar) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేశ వ్యతిరేక కథనాలను’ కోవిడ్ వైరస్ (Covid virus)గా ఆయన అభివర్ణించారు. ఆ కథనాలను తటస్థీకరించాలని అన్నారు. ప్రణాళికాబద్ధంగా లేదా అవగాహన లేమి కారణంగా కొంతమంది ‘దేశ వ్యతిరేక’కథనాలను వ్యాప్తి చేస్తూ ఆనందం పొందుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
అలాంటివి జరగకూడదని అన్నారు. అటువంటి కథనాలు ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఇది కోవిడ్ వైరస్ లాంటిదన్నారు. కురుక్షేత్ర యూనివర్సిటీ, కురుక్షేత్ర డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ‘వసుధైక కుటుంబం’, భగవద్గీత & గ్లోబల్ యూనిటీ’ అనే అంశంపై నిర్వహించిన మూడు రోజుల అంతర్జాతీయ సెమినార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ గీతా ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జగదీప్ ధన్ ఖడ్ మాట్లాడుతూ…. గీత తత్వశాస్త్రం అనేది భారతీయ నాగరికత, దాని సంస్కృతికి గట్టి పునాదిలాంటిందని తెలిపారు. ప్రస్తుతం భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకు వెళ్తోందని పేర్కొన్నారు.
మనం ఒక ప్రపంచ శక్తి అని వెల్లడించారు.
మనమంతా శాంతి కోసం నిలబడతామన్నారు. మనమంతా ప్రపంచ స్థిరత్వం కోసం నిలబడతామన్నారు. 2047లో మన స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే నాటికి భారత్‌ను అత్యంత పటిష్టమైన శక్తిగా అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లాలని కోరుకుంటున్నామన్నారు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణను ఈ సందర్బంగా ప్రస్తావించారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచం ఈ రోజు చూస్తున్నంత బాధను ఎన్నడూ చూడలేదన్నారు.