పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలో రాజకీయ నాయకులు ప్రచార జోరును పెంచారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే, 2024 ఎన్నికల్లో టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేన(JANASENA) కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండగా..అధికార వైసీపీ పార్టీ మాత్రం సింగిల్‌గా బరిలోకి దిగుతోంది.
ఈ క్రమంలోనే కూటమిలో భాగమైన బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (Central minister piyush goyal) గురువారం ఏపీలో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగునెలకు రావడం గర్వంగా ఉందని చెప్పారు. గత ఐదేళ్ళుగా ఏపీ చాలా వెనుకబడిందని, రైతులను ఏపీ సర్కార్ పూర్తిగా పట్టించుకోవడం మానేసిందన్నారు. గత ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి నిలిచిపోయిందని, ఇసుక మాఫియా, లాండ్ మాఫియా, లిక్కర్ మాఫియాలకు కేంద్రంగా మారిందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గృహాలు ప్రజలకు చేరలేదని, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం రూ. వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చినప్పటికీ భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించలేదన్నారు. మోడీ నాయకత్వంలో భారతదేశం జీడీపీలో 5వ స్ధానానికి ఎగబాకిందన్నారు. 2014, 2019లలో ఇచ్చిన ఏ హామీలను మోదీ మర్చిపోలేదని, రామమందిర నిర్మాణం భారతీయులందరికీ గర్వకారణం అని చెప్పారు.
2047 నాటికి వందేళ్ల స్వాతంత్య్రాన్ని మనం పండుగలా చేసుకోవాలి, ప్రతి ఇంటికీ నీటి సదుపాయం ఉండేలా కేంద్రం పని చేస్తుందన్నారు.
ప్రతీ భారతీయుడి భవితవ్యం కోసం కేంద్రం పని చేస్తోందని వివరించారు. భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం అత్యున్నత విధానాలు తీసుకొచ్చిందన్నారు. ఈఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలిచి చంద్రబాబు సీఎం అవుతారని, ఏపీ నుంచి 25 ఎంపీలు తమ కూటమికి వస్తాయన్నారు. ప్రజల మంచి కోసమే మోడీ,చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కలిశారని చెప్పుకొచ్చారు.