బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)ను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) కలిశారు. ఈ రోజు ఉదయం అమరావతి నుంచి సీఎం జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం జూబ్లిహిల్స్ నంది నగర్ లోని కేసీఆర్ నివాసం వద్దకు వెళ్లారు. అక్కడ జగన్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు రిసీవ్ చేసుకున్నారు.
డిసెంబర్ 7న ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్ కాలు జారి పడ్డారు. ఆయన ఎడమ తుంటికి గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఆయన్ని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. కేసీఆర్ కు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని సూచించారు.
శస్త్ర చికత్స అనంతరం కేసీఆర్ డిశ్చార్జ్ చేశారు. అప్పటి నుంచి నంది నగర్ నివాసంలో కేసీఆర్ ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నెమ్మదిగా స్ట్రెచర్ సహాయంతో కేసీఆర్ నడుస్తున్నారని అంటున్నారు. ఇది ఇలా వుంటే గతంలో కేసీఆర్ ను సీఎం జగన్ పలు మార్లు కలిశారు.
పలు సందర్భాల్లో ఇరువురు నేతలు స్నేహంగా మాట్లాడుకునే వారు. కానీ ఆ తర్వాత ప్రాజెక్టుల వివాదాల నేపథ్యంలో ఇరువురు నేతలు కలుసుకోవడం కానీ, మాట్లాడుకోవడం గానీ చేయడం లేదు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ను జగన్ మొదటి సారి కలుసుకున్నారు.