టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర మొత్తం వెన్నుపోట్లు, మోసం, అబద్ధాలేనని ఆరోపించారు. సొంత కొడుకుపై నమ్మకం లేకనే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గొడవలు సృష్టించి శవ రాజకీయాలు చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
సోమవారం నగరిలో జరిగిన కార్యక్రమంలో విద్యా దీవెన నిధులను సీఎం విడుదల చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.680.44 కోట్లను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని, పిల్లనిచ్చిన మామను కూడా వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. చంద్రబాబు ప్రతి అడుగు కుట్రలు, కుతంత్రాలేనని మండిపడ్డారు.
పుంగనూరులో అల్లర్లు సృష్టించారని, పోలీసులపై దాడి చేశారని చంద్రబాబుపై జగన్ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో దొంగ ఓట్లను తొలగిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వార్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు ఒక్క మంచి పథకమైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా పాలన ఉండేదని దుయ్యబట్టారు.
అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15 వేల అందించామని అన్నారు. స్కూళ్లు ప్రారంభించే నాటికే విద్యాకానుక అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నామని.. బైజూస్ కంటెంట్‌తో విద్యార్థులకు బోధన అందిస్తున్నామని తెలిపారు. పేదరికం విద్యార్థుల చదవులకు అడ్డు రాకూడదన్నారు. విద్యా సంస్థల్లో అక్రమాలుంటే 1902కు కాల్ చేయాలని తెలిపారు. నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామని.. 3వ తరగతి నుంచే సబ్జెట్ టీచర్‌తో పాఠాలు.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా అందజేస్తున్నామని పేర్కొన్నారు.