టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడి (Chandra Babu Naidu)కి భారీ ఊరట లభించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయనకు హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ఏపీ హైకోర్టు వెల్లడించింది. అంతకు ముందు ఆయన బెయిల్ పై ఉన్న షరతులన్నింటినీ తొలగిస్తున్నట్టు పేర్కొంది.
రాజకీయ సమావేశాల్లో నేరుగా పాల్గొనేందుకు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 29 నుంచి రాజకీయ ర్యాలీల్లో చంద్రబాబు పాల్గొన వచ్చని తెలిపింది.
చంద్రబాబు ఆరోగ్య నివేదికను ఈ నెల 28లోగా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుకు భారీ ఊరట లభించడంతో టీడీపీ శ్రేణులు సంబురాల్లో మునిగి తేలుతున్నాయి.
ఇది ఇలా వుంటే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ ను రద్దు చేయాలని, ఎఫ్ఐఆర్‌ను కొట్టి వేయాలని సుప్రీం కోర్టులో టీడీపీ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. దానిపై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఈ కేసు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వులో పెట్టింది.
దీపావళి సెలవుల అనంతరం తీర్పు ప్రకటిస్తామని గతంలో ధర్మాసనం వెల్లడించింది. దీంతో ఈ కేసులో రేపో మాపో ధర్మాసనం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన 53 రోజుల పాటు గడిపారు. అనంతరం అనారోగ్య కారణాల నేపథ్యంలో ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది.