ఏపీలో గత టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టు, తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం మరోసారి ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా చంద్రబాబు తాజాగా జడ్జితో తాను నీతిమంతుడిని అని చెప్పుకోవడం, చంద్రబాబుకు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మద్దతివ్వడంపై బొత్స మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.
న్యాయమూర్తి ముందు తాను నీతిమంతుడిని అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారని, చంద్రబాబు జైల్లో ఉండటం అందరికీ బాధ అనిపిస్తుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు అవినీతి లేకుండా పాలన చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 371 కోట్లు ఇచ్చిన తర్వాత సీమెన్స్ ఇవ్వాల్సిన 2900 కోట్లు ఏమైందని ఆయన ప్రశ్నించారు. మధ్యలో డిజైన్ టెక్ కంపెనీ ఎందుకు వచ్చిందన్నారు. సీమెన్స్ కంపెనీని తాము ఎప్పుడూ తప్పు పట్టలేదని బొత్స గుర్తుచేశారు.
గుజరాత్ లో సీమెన్స్ కంపెనీ నేరుగా ప్రాజెక్టు చేపట్టిందని, ఏపీలో అలా జరగలేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబును ఈ కేసులో నిందితుడిగా చేర్చి ప్రేమ్ చంద్రారెడ్డి వంటి అధికారుల్ని వదిలేయడాన్ని బొత్స సమర్ధించుకున్నారు. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉందో అందరినీ నిందితులుగా చేరుస్తామని మంత్రి తెలిపారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు పాత్ర లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు.
మరోవైపు చంద్రబాబుకు మద్దతుగా తెలంగాణ స్పీకర్ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి బొత్స తప్పుబట్టారు. రాజ్యాంగ పదవిలో ఉండి చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. పోచారం వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బొత్స పేర్కొన్నారు. ఇలా మాట్లాడవచ్చా అని వాళ్ల సీఎం కేసీఆర్ ను అడిగితే చెప్తారన్నారు. రాజకీయ లబ్ది కోసం ఏదైనా మాట్లాడవచ్చు కానీ…వ్యవస్థలను తాకట్టు పెట్టేలా వ్యవహరించకూడదన్నారు.