మహిళా రిజర్వేషన్ (Woman Reservation Bill) బిల్లుపై కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ(Sonia Gandhi) స్పందించారు. ఈ బిల్లు మనదేనన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్వీట్ చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యేందకు సోనియాగాంధీ ఈ రోజు పార్లమెంట్ కు చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో బిల్లుపై అభిప్రాయాన్ని తెలపాలని ఆమెను మీడియా కోరింది. ఈ నేపథ్యంలో బిల్లు మనదేనని ఆమె అన్నారు. అంతకు ముందు కాంగ్రెస జనరల్ సెక్రటరీ, రాజ్య సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ స్పందించారు. దేశం నిజంగా అభివృద్ధి చెందాలంటే, నిర్ణయాత్మక ప్రక్రియల నుండి 50 శాతం జనాభాను వది పెట్టకూడదన్నారు. ఈ విషయాన్ని సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గుర్తించారన్నారు.
అందుకే 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చి రాజ్యసభలో ఆమోదించారని చెప్పారు. ఈ బిల్లుపై బీజేపీ సీరియస్‌గా ఉంటే వెంటనే లోక్‌సభలో బిల్లును ఆమోదించేలా చూస్తుందన్నారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత కపిల్ సిబల్ స్పందించారు. ఈ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉందన్నారు.
అలాంటి సందర్భంలో ప్రధాని మోడీ ఈ బిల్లు కోసం పదేండ్లు ఎందుకు వేచి చూశారని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లును 2024లోనే ఎందుకు ప్రవేశ పెడుతున్నారని ఆయన అడిగారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించక పోతే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోనూ బీజేపీకి ఓటమి తప్పదన్నారు.