రామనామ స్మరణతో అయోధ్య మార్మోగిపోతోంది. జనవరి 22న జరిగే మహా సంప్రోక్షణ వేడుకల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. తాను పుట్టి పెరిగిన నేలపై కొన్ని వందల సంవత్సరాల పాటు తనకంటూ ఓ గుడి కూడా లేకుండా అరణ్యవాసం చేస్తున్న రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం మందిరం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ‘రాష్ట్ర’ వరుస కథనాలు ఇస్తోంది. అయోధ్య చరిత్ర మొదలు.. అసలు వివాదమేంటి..? ఏం జరిగింది? ఎలా జరిగింది? వంటి అంశాలపై ఇప్పటిదాకా తెలుసుకున్నాం. ఇప్పుడు కోర్టు కేసులు, తీర్పుల గురించి తెలుసుకుందాం.
1950: శ్రీరాముడి విగ్రహానికి పూజలు నిర్వహించే హక్కు తమకుందంటూ గోపాల్ సిమ్లా విశారద్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే ఏడాది పూజలు కొనసాగిస్తూనే అదే చోట విగ్రహం ఉండేలా అనుమతి కోరుతూ పరమహంస రామచంద్ర దాస్ పిటిషన్ వేశారు.
1959: నిర్మోహి అఖారా ఆ స్థలంపై హక్కులు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
1981: ఉత్తరప్రదేశ్ కు చెందిన సున్నీ వక్ఫ్ బోర్డు ఆ స్థలం తమకు అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయించింది.
1986: ఫిబ్రవరి 1న హిందూవుల కోసం గేట్లు తెరిచే ఉంచాలని స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
1989: ఆగష్టు 14న అలహాబాద్ హైకోర్టు స్టేటస్ కో మెయిన్ టెయిన్ చేయాలని చెప్పింది.
1992: డిసెంబర్ 6న రామజన్మభూమిలో బాబ్రీ మసీదు నిర్మాణం కూల్చివేత
1993: ఏప్రిల్ 3న వివాదం నెలకొన్న ప్రాంతంలో కొంత భూమిని సేకరించాలంటూ అయోధ్య చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఇదే ఏడాది కేంద్రం తీసుకొచ్చిన చట్టంపై పలు రిట్ పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. దాఖలు చేసిన వారిలో ఇస్మాయిల్ ఫరూఖీ కూడా ఉన్నారు.
1994: అక్టోబర్ 24న ఇస్లాంలో మసీదు అనేది ఒక భాగం కాదని ఇస్మాయిల్ ఫరూఖీ కేసులో సుప్రీం పేర్కొంది.
2002: ఏప్రిల్ లో భూమిపై అసలైన హక్కులు ఎవరు కలిగి ఉన్నారు అనేదానిపై అలహాబాద్ హైకోర్టు వాదనలు వినడం ప్రారంభించింది.
2003: మార్చి 13న ఎలాంటి మతపరమైన పూజలు, ప్రార్థనలు నిర్వహించరాదని అస్లాం అలియాస్ భూరే కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
2003: మార్చి 14న అలహాబాద్ హైకోర్టులో కేసుకు సంబంధించిన సివిల్ పిటిషన్ల విచారణ పూర్తయ్యేవరకు మధ్యంతర ఉత్తర్వులు అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం.
2010: సెప్టెంబర్ 30న వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాలకు సమానంగా పంచాలంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు వెల్లడించింది.
2011: మే 9న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
2016: ఫిబ్రవరి 26న భూమిలో శ్రీరాముడి ఆలయం నిర్మించేందుకు అనుమతించాలంటూ సుబ్రమణియన్ స్వామి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
2017: మార్చి 21న కోర్టు బయటనే మూడు పార్టీలు కలిసి ఈ వివాదం పరిష్కరించుకోవాలంటూ చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ సూచించారు.
2017: ఆగస్ట్ 7న 1994లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషనర్ల వాదనలు వినేందుకు త్రిసభ్య ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.
2017: ఆగస్ట్ 8న వివాదాస్పద భూమికి కాస్త దూరంలో అంటే మెజార్టీ ముస్లింల ప్రాంతంలో మసీదు నిర్మాణం చేపట్టొచ్చంటూ యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది.
2017: సెప్టెంబర్ 11న అబ్జర్వర్లుగా ఇద్దరు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిలను నియమించాలంటూ అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు సుప్రీంకోర్టు సూచించింది.
2017: నవంబర్ 20న అయోధ్యలో శ్రీరాముడి ఆలయం లక్నోలో మసీదు నిర్మాణం చేసుకోవచ్చని యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది.
2017: డిసెంబర్ 1న 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో 32 పిటిషన్లు దాఖలయ్యాయి.
2018: ఫిబ్రవరి 8న సివిల్ అప్పీల్స్ వాదనలు వినడం ప్రారంభించిన సుప్రీంకోర్టు
2018: మార్చి 14న మధ్యంతర పిటిషన్లన్నింటినీ తిరస్కరించింది సుప్రీంకోర్టు. ఇందులో సుబ్రమణియన్ స్వామి పిటిషన్ కూడా ఉంది.
2018: ఏప్రిల్ 6న 1994లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించి కేసును పెద్ద బెంచ్ కు బదిలీ చేయాలంటూ సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధవన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
2018: జూలై 6న 1994లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని చెప్పడంతో కేసును ముస్లిం సంస్థలు మరింత జాప్యం చేస్తున్నాయని యూపీ ప్రభుత్వం సుప్రీం దృష్టికి తీసుకెళ్లింది.
2018: జూలై 20న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
2018: సెప్టెంబర్ 27న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసేందుకు నిరాకరించింది సుప్రీం. కొత్తగా త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసి అక్టోబర్ 29 నుంచి వాదనలు వింటుందని స్పష్టం చేసింది.
2018: అక్టోబర్ 29న అయోధ్య కేసులో వాదనలు వినేందుకు సరైన బెంచ్ ను ఏర్పాటు చేస్తామని చెబుతూ జనవరి మొదటి వారానికి కేసు విచారణ వాయిదా వేసింది. అంతేకాదు వాదనల షెడ్యూల్ కూడా ఆ బెంచ్ నిర్ణయిస్తుందని పేర్కొంది.
2018: నవంబర్ 12న అఖిల భారత హిందూ మహాసభ దాఖలు చేసిన పిటిషన్ ను త్వరగా విచారణ చేసేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు.
2018: నవంబర్ 22న అయోధ్య కేసులో వాదనలు ముగిసే వరకు దీనిపై ఎలాంటి చర్చలు చేపట్టరాదని, దీని వల్ల నష్టం వాటిల్లుతుందని పేర్కొంది సుప్రీం.
2019: జనవరి 4న అయోధ్య కేసు వినేందుకు గాను సరైన బెంచ్ ను ఏర్పాటు చేయడమే కాదు.. ఏ రోజున వాదనలు వింటుందో అనే తేదీలను 10న ఖరారు చేస్తుందని పేర్కొంది సుప్రీంకోర్టు.
2019: జనవరి 8న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయగా.. సభ్యులుగా జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, యూయూ లలిత్, డీవై చంద్రచూడ్ లు ఉన్నారు.
2019: జనవరి 10న జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం నుంచి తప్పుకుంటూ జనవరి 29న కొత్త బెంచ్ ముందు వాదనలు వినిపించాలని కోరారు.
2019: జనవరి 25న కొత్త రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఇందులో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తో పాటు సభ్యులుగా జస్టిస్ ఎస్ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్‌ఏ నజీర్ లు ఉన్నారు.
2019: జనవరి 27న జస్టిస్ ఎస్ఏ బాబ్డే అందుబాటులో లేని కారణంగా జనవరి 29న విచారణను వాయిదా వేశారు.
2019: జనవరి 29న అయోధ్య భూమి పరిసరాల్లో ఉన్న 67 ఎకరాల భూమిని ఒరిజినల్ ఓనర్లకు ఇచ్చేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టును కేంద్రం కోరింది.
2019: ఫిబ్రవరి 20న విచారణ జరిపిన సుప్రీం.. ఫిబ్రవరి 26న వాదనలు వింటామని చెప్పింది.
2019: ఫిబ్రవరి 26న మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ మార్చి 5లోగా మధ్యవర్తులను ఏర్పాటు చేస్తామంటూ ఆర్డర్ ఇచ్చింది.
2019: మార్చి 6న మధ్యవర్తిత్వం ద్వారా వివాదం పరిష్కారం అవుతుందా లేదా? అనేదానిపై ఆర్డర్ ను రిజర్వ్‌లో పెట్టింది సుప్రీంకోర్టు.
2019: మార్చి 8న సుప్రీం మాజీ జడ్జి ఖలీఫుల్లా నేతృత్వంలో వివాదాస్పద భూమి పరిష్కారం కోసం మధ్యవర్తులను నియమించింది న్యాయస్థానం.
2019: మే 10న మధ్యవర్తులు సుప్రీంకోర్టులో ఫైనల్ రిపోర్టును సబ్మిట్ చేశారు
2019: ఆగష్టు 6న రోజువారీగా అయోధ్య కేసులో వాదనలు వింటామని చెప్పి అదేరోజు ప్రారంభించింది సుప్రీంకోర్టు.
2019: అక్టోబర్ లో.. 18 కల్లా అయోధ్య కేసులో అన్ని వాదనలు పూర్తి కావాలని ఆదేశాలొచ్చాయి.
2019: అక్టోబర్ 15న 16 నాటికి వాదనలు పూర్తి కావాలంటూ మరోసారి చెప్పారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్.
2019: నవంబర్ 9న తుది తీర్పు వెలువడింది. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని భాగాలుగా పంచడం కుదరదని చెప్పింది కోర్టు. ఇదంతా ఒకే భూభాగం. రామ్ లల్లాకు చెందుతుంది. ఈ స్థలంలో రామమందిర నిర్మాణం చేపట్టాలి. తీర్పు అమలుకు ప్రభుత్వం మూడు నెలల్లో ఒక ప్రణాళికను రూపొందించాలని ఆదేశించింది. బాబ్రీ మసీదు ఖాళీ స్థలంలో నిర్మించింది కాదు. మసీదు నిర్మాణానికి ముందు అక్కడున్న నిర్మాణాన్ని కూల్చివేశారా, లేదా అన్నది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) స్పష్టం చేయలేదు. బాబ్రీ మసీదు కట్టడానికి ముందు అక్కడున్న నిర్మాణం ఇస్లామిక్ నిర్మాణం కాదని అక్కడి శిథిలాలకు సంబంధించి ఏఎస్‌ఐ ఇచ్చిన నివేదికలోని ఆధారాలు చెబుతున్నాయి. ఈ స్థలంలో 1528 నుంచి 1856 మధ్య నమాజ్ జరిగినట్లు ఆధారాలు లేవు. అన్ని ఆధారాలను పరిశీలించి, ఈ భూమిని రాముడి ఆలయ నిర్మాణం కోసం హిందువులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డ్ కు అయోధ్యలోనే ఒక ప్రధాన ప్రాంతంలో ఐదెకరాల స్థలం కేటాయించాలని చెప్పింది. ఈ 2.77 ఎకరాల స్థల నిర్వహణ, ఆలయ నిర్మాణ బాధ్యతలు చూడటానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని తెలిపింది.
2019: డిసెంబర్ 12న సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన మొత్తం 18 పిటిషన్లను కొట్టివేసింది న్యాయస్థానం.
సుప్రీం తీర్పు తర్వాత ఏం జరిగింది..? ఆలయ నిర్మాణ ప్లానింగ్ ఏంటి..? కేంద్రం తీసుకున్న చొరవపై తర్వాతి కథనంలో ‘రాష్ట్ర’ ప్రధాన అంశాలను వివరించనుంది.