డ్రైవర్ లెస్ కార్ల (Driverless Cars)పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్ రహిత కార్లను భారత్ లోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఈ డ్రైవర్ రహిత కార్లను అనుమతిస్తే దేశంలోని 80 లక్షల మంది డ్రైవర్లు నిరుద్యోగులుగా మారుతారని, చాలా మంది ఉపాధి కోల్పోతారని తెలిపారు.
ఐఐఎం (IIM)నాగ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ…. గతంలో భారత్‌లో డ్రైవర్ లేని కార్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అమెరికాలోనే చెప్పానని గుర్తు చేశారు. ఎందుకంటే మన దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు డ్రైవర్లుగా పని చేస్తున్నారని అన్నారు.
అలాంటప్పుడు డ్రైవర్ లేని కార్లను తీసుకు వస్తే అవి వారి ఉద్యోగాలను కొల్లగొడతాయన్నారు. కేవలం తక్కువ జనాభా కలిగిన దేశాలకు మాత్రమే అలాంటి కార్లు పనికి వస్తాయన్నారు. కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల ఏర్పాటు, రోడ్లపై బ్లాక్ స్పాట్‌లను తొలగింపు వంటి చర్యలతో రోడ్డు ప్రమాదాాలను పూర్తిగా తగ్గించేందుకు ఒక ఫ్రేమ్ వర్క్ ను రూపొందించామన్నారు.
ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మరోవైపు హైడ్రోజన్ అనేది భవిష్యత్ ఇంధనం అని అన్నారు. ఇక టెస్లాను తాము స్వాగతిస్తున్నామన్నారు. కానీ చైనాలో కార్లు తయారు చేసి ఇక్కడ విక్రయాలు చేస్తామంటే ఒప్పుకోబోమన్నారు. టెస్లా కార్లను భారత్ లోనే తయారు చేయాలన్నారు.