రాజస్థాన్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ (Congress)దూకుడు పెంచింది. తాజాగా మేనిఫెస్టో (Manifesto)ను అధికార కాంగ్రెస్ విడుదల చేసింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల గణన నిర్వహిస్తామని వెల్లడించింది. పంచాయతీ స్థాయిలో నియామకాలను చేపడతామని హామీ ఇచ్చింది. ప్రజల సంక్షేమానికి పలు సంక్షేమ పథకాలను చేపడతామని పేర్కొంది.
మేనిఫెస్టో విడుదల సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే మాట్లాడుతూ.. తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పై దుర్భాషలాడటం తప్ప ప్రధాని మోడీ వేరే ఏమీ చేయలేదని మండిపడ్డారు. గతంలో రాహుల్ గాంధీని మోడీ దూషించే వారన్నారు. కానీ ఇప్పుడు అశోక్ గెహ్లాట్ ను కూడా దూషిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
తమ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని చెప్పారు. కానీ బీజేపీ ఎంత ప్రయత్నించినా రాజస్థాన్లో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రాజస్థాన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కుల గణన జరిగేలా చూస్తామన్నారు. అనంతరం సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ… రాజస్థాన్ ఆర్థిక పరిస్థితిని తమ ప్రభుత్వం నిర్వహించుకున్న తీరును చూసి రాజస్థాన్ ప్రజలు చాలా గర్వంగా భావిస్తారని చెప్పారు.
రాజస్థాన్లో తలసరి ఆదాయం 46.48 శాతం పెరిగిందన్నారు. 2030 వరకు తలసరి ఆదాయంలో నంబర్ వన్ స్థానంలో నిలవడం తమ కల అని అన్నారు. 2020-21లో రాష్ట్ర జీడీపీ 19.50కి చేరుకుందన్నారు. ఇది ఈ దశాబ్దంలోనే అత్యధికమని వెల్లడించారు. ఇటీవల సీఎం గెహ్లాట్ ఏడు గ్యారెంటీలను కూడా ప్రకటించారు. ఇది ఇలా వుంటే రాష్ట్రంలోని 1.06 కోట్ల మంది లబ్దిదారులకు రూ. 500లకు గ్యాస్ సిలిండర్ అందజేస్తామని హామీ ఇచ్చింది.
పశువుల పెంపకందారుల నుంచి కిలోకు రూ. 2 చొప్పున పేడను కొనుగోలు చేస్తామని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ కోసం చట్టాన్ని తీసుకు వస్తామని చెప్పింది. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లేదా ట్యాబ్ లు అందజేస్తామని ప్రకటించింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షల వరకు బీమా కవరేజీ కల్పిస్తామని పేర్కొంది.