ఆసియా క్రీడల్లో (Asian Games) భారత (India) జైత్ర యాత్ర ముగిసింది. చైనా (China) లోని హాంగ్జౌలో సెప్టెంబర్ 23న మొదలైన క్రీడా సమరం రేపటితో ముగిసింది. ఒక రోజు ముందుగానే భారత్ అన్ని ఈవెంట్స్ ముగిశాయి. దీంతో భారత్ విజయ గర్వంతో స్వదేశానికి చేరుకుంటోంది. ఈ సారి ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో పతకాలు సాధించింది. ఈ క్రీడల్లో భారత్ మొత్తం 107 పతకాలను సాధించింది.
భారత్ కు మొత్తం 28 పసిడి, 38 రజతాలు, 41 కాంస్యాలు వచ్చాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ నాల్గవ స్థానంలో నిలిచింది. 14వ రోజైన శనివారం భారత్ కు పతకాల పంట పండింది. ఈ రోజు ఏకంగా 12 పతకాలు భారత్ ఖాతాలో వచ్చి చేరాయి. అందులో ఆరు స్వర్ణ పతకాలు ఉండటం గమనార్హం. దీంతో పాటు నాలుగు రజతాలు, 2 కాంస్య పతకాలను భారత క్రీడాకారులు సాధించారు.
ఆర్చరీ కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో ఆర్చర్ జ్యోతి సురేఖ మూడో స్వర్ణాన్ని గెలుచుకున్నారు. ఇక ఇదే విభాగంలో అదితి గోపీచంద్ కాంస్యం సాధించింది. ఆర్చరీ పురుషుల కాంపౌండ్ విభాగంలో ఓజాస్ డియోటేల్ స్వర్ణం పతకాన్ని దక్కించుకున్నారు. అదే విభాగంలో అభిషేక్ వర్మ సిల్వర్ మెడల్ సాధించారు. మహిళల హాకీలో టీం ఇండియా కాంస్యాన్ని అందుకుంది.
మహిళల కబడ్డీలో చైనీస్ తైపీని ఓడించి పసిడి పతకాన్ని ఒడిసి పట్టుకుంది. ఇక పురుషుల క్రికెట్ జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల రెజ్లింగ్ 86 కిలోల విభాగంలో దీపక్ పూనియా రజతం గెలుచుకున్నారు. చెస్‌లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలతో కూడిన మహిళల జట్టుకు రజతం సాధించింది. ఇక ప్రజ్ఞానంద, అర్జున్‌లతో కూడిన పురుషుల జట్టు కూడా రజతాన్ని గెలుచుకుంది.