అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) సంస్థ సంచలన విషయాలు వెల్లడించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్న 103 మంది ఎమ్మెల్యేల ఆస్తులు (MLAs Assets) భారీగా పెరిగినట్టు ఏడీఆర్ తెలిపింది. 2018 నుంచి 2023 మధ్య ఎమ్మెల్యేల ఆస్తులు 65 శాతం పెరిగినట్టు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్న ఎమ్మెల్యేల్లో 87 శాతం మంది ఆస్తులు పెరిగినట్టు తెలిపింది. మొత్తం 103 మందికి గాను 90 మంది ఎమ్మెల్యేల ఆస్తులు పెరిగినట్టు చెప్పింది. వారి ఆస్తులు 3 శాతం నుంచి 1331 శాతం పెరిగినట్టు, 13 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 1 నుంచి 79 శాతం తగ్గిపోయినట్టు పేర్కొంది.
నివేదిక ప్రకారం…. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ ఎమ్మెల్యేల సరాసరి ఆస్తులు రూ. 14.44 కోట్లుగా ఉంది. తాజాగా 2023లో ఆ ఎమ్మెల్యేల సరాసరి ఆస్తులు రూ. 23.87 కోట్లకు చేరింది. తిరిగి పోటీ చేస్తున్న 90 మంది ఎమ్మెల్యేల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో అత్యధిక సగటు ఆస్తుల పెరుగుదల కనిపించింది.
అధికార బీఆర్ఎస్‌కు చెందిన పైళ్ల శేఖర్ రెడ్డి సంపద 2018లో రూ.91.04 కోట్ల నుండి 2023లో రూ.227.51 కోట్లకు పెరిగింది. అంటే ఆయన సంపద రూ. 136.47 కోట్లు (150శాతం) పెరిగింది. బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తుల్లో అత్యల్ప వృద్ధి నమోదైంది. సగటున వారి ఆస్తులు 9.5 శాతం పెరిగాయి.ఇక ఎంఐఎం ఎమ్మెల్యేల ఆస్తులు దాదాపు 59శాతం, కాంగ్రెస్ ఆస్తులు 55.12 శాతం పెరిగాయి.