ఇజ్రాయెల్ (Israel) దాడులతో గాజా (Gaza) అట్టుడికి పోతోంది. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరం (Jabalia refugee camp)పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 195 మంది పాలస్తీనా పౌరులు మరణించినట్టు హమాస్ నేతృత్వంలోని ప్రభుత్వం వెల్లడించింది. సుమారు 200 మంది వరకు ఈ దాడిలో గాయపడినట్టు పేర్కొంది.
శిథిలాల కింద మరో 120 మంది వరకు చిక్కుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఇది ఇలావుంటే ఈ దాడులపై ఐరాస మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. శరణార్ధుల శిబిరంపై దాడిని యుద్ధ నేరాలకు సమానమైన దాడులుగా ఐరాస మానవ హక్కుల కమిషన్ పేర్కొంది.
మరోవైపు ఇద్దరు టాప్ హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని మంగళ, బుధవారాల్లో దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ మిలిటెంట్లు తమ ఉగ్ర స్థావరాలను, మౌలిక సౌకర్యాలను ఉద్దేశపూర్వకంగానే పౌరులు నివసించే భవనాలకు సమీపంలో ఏర్పాటు చేశారని, తద్వారా గాజాలోని పౌరులను ప్రమాదంలోకి నెడుతున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.
మరోవైపు గాజా నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల ఇజ్రాయెల్-ఈజిఫ్టు-హమాస్ ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మొదటి జాబితాలో 500 పౌరులను ఈజిఫ్టుకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. అందులో 320 మంది విదేశీ పౌరులు ఉన్నట్టు తెలిపారు. ఒప్పందం ప్రకారం ఈ రోజు కూడా మరి కొంత మందిని ఈజిఫ్టుకు తరలిస్తామన్నారు.