హైదరాబాద్ అబిడ్స్ (Abids)లో బిర్యానీ (Biryani) విషయంలో వివాదం తలెత్తింది. వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి చివరకు కస్టమర్లు, హోటల్ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హోటల్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. దాడి చేసిన సిబ్బందిని అరెస్టు చేశారు.
ఇంతకు ఏం జరిగిందంటే…. దూల్ పేటకు చెందిన కొంత మంది వ్యక్తులు బిర్యానీ తినేందుకు అబిడ్స్ లోని ఓ హోటల్ కు వెళ్లారు. అక్కడ మటన్ బిర్యానీ కోసం ఆర్డర్ ఇచ్చారు. దీంతో వాళ్లు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్లకు హోటల్ సిబ్బంది బిర్యానీ సర్వ్ చేశారు. కానీ బిర్యానీలో మటన్ సరిగ్గా ఉడకలేదని హోటల్ సిబ్బందికి వాళ్లు ఫిర్యాదు చేశారు. కానీ దాన్ని హోటల్ సిబ్బంది పట్టించుకోలేదు.
ఈ క్రమంలో ఆ కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మటన్ బిర్యానీకి బిల్లు చెల్లించబోమని హోటల్ వెయిటర్లకు తెగేసి చెప్పారు. దీంతో వెయిటర్లకు, కస్టమర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అది ఘర్షణకు దారి తీసింది. హోటల్ వెయిటర్ల పై ఆ వ్యక్తులు దాడి చేశారు. దీంతో వెయిటర్లు కస్టమర్ల పై కర్రలతో దాడికి దిగారు. దీంతో కస్టమర్లకు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరుకున్నారు. ఇరు పక్షాలను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం హోటల్ యాజమాన్యం పై కేసులు నమోదు చేశారు. ముగ్గురు వెయిటర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడిలో కస్టమర్లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే హోటల్ కు నిప్పుపెడతామని హెచ్చరించారు.