అరవింద్ ఘోష్ (Aravind Ghosh).. రాజకీయ స్వాతంత్య్రం దేశానికి ఆయువు పట్టు అని ప్రకటించిన నేత. న్యూ లాంప్స్ ఫర్ ఓల్డ్ (New Lamp For Old) అనే శీర్షికన బ్రిటీష్ వారి విధానాలపై నిప్పులు చెరిగారు. బెంగాల్ ప్రెసిడెన్సీలో ఎంతో మంది రహస్య విప్లవ కారులను తయారు చేసి స్వతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. తర్వాత తత్వవేత్తగా మారి తత్వ శాస్త్రంలోని ప్రాపంచిక దృక్ఫథాలను నిర్మించేందుకు ప్రయత్నం చేశారు.
15 ఆగష్టు 1872న కోల్కతాలో జన్మించారు. తండ్రి కృష్ణ ధన్ ఘోష్, తల్లి స్వర్ణ లతా దేవి. కృష్ణ ధన్ ఘోష్ తన పిల్లలను చిన్నతనంలోనే ఇంగ్లాండ్ కు పంపించి ఆంగ్ల విద్యాభ్యాసం చేయించారు. అరవింద్ ఘోష్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ కోర్సులో చేరాడు. అందులో గుర్రపు స్వారీ పరీక్షకు ఆలస్యంగా హాజరు కావడంతో ఐసీఎస్ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోయారు.
అనంతరం ఘోష్ భారత్ కు చేరుకున్నారు. 1906లో నేషనల్ కాలేజ్ ఆఫ్ కలకత్తాలో ప్రిన్సిపల్ గా చేరారు. ఆ సమయంలో బ్రిటీష్ సామాజ్రవాదం గురించి, వలస వాదానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్ల గురించి విస్తృతంగా పరిశోధనలు చేశారు. అప్పుడే ఆయన కరుడు కట్టిన విప్లవ వాదిగా మారారు.
చాలా మందిని తన ప్రసంగాలు, బోధనలతో విప్లవం వైపు మళ్లించారు. వందే మాతరం పత్రికా సంపాదకునిగా ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఎంతో మందిని స్వాతంత్య్ర పోరాటం వైపు మళ్లించాడు. ఈ క్రమంలో అలీపూర్ కుట్ర కేసులో ఆయన్ని అరెస్టు చేశారు ఈ కేసులో సరైన సాక్ష్యం లేకపోవడంతో తర్వాత ఆయన్ని విడుదల చేశారు.
జైళ్లో ఉన్న సమయంలో ఆయన ఆలోచనలు అద్యాత్మిక వైపు మళ్లింది. విడుదలైన తర్వాత ధ్యాన యోగం వైపు అడుగులు వేశారు. పాండిచ్చేరికి వెళ్లి అక్కడ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ తర్వాత కర్మ యోగీ అనే ఇంగ్లీష్, ధర్మ అనే బెంగాలీ పుస్తకాలను రచించారు. తర్వాత కాలంలో దేశ విభజనను ఆయన వ్యతిరేకించారు. చివరకు 1950లో ఆయన మరణించారు.