జార్ఖండ్‌లో చంపయ్ సోరెన్ (Champai soren) నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్ష (Floor Test)లో నెగ్గింది. అసెంబ్లీలో సోమవారం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అందులో విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 47, వ్యతిరేకంగా 29 ఓట్లు పడ్డాయి. విశ్వాస తీర్మానం నెగ్గడంతో చంపయ్ సోరెన్ ప్రభుత్వ మనుగడకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
వీశ్వాస తీర్మానం సందర్బంగా సభ్యులంతా ఒక్కొక్కరిగా నిలబడి తీర్మానానికి మద్దతు లేదా వ్యతిరేకతను తెలియజేయాలని అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో సూచించారు. తీర్మానానికి అనుకూలంగా 47 ఓట్లు రావడంతో విశ్వాస పరీక్షలో చంపయ్ సోరెన్ ప్రభుత్వం నెగ్గినట్టు స్పీకర్ ప్రటించారు. అనంతంర అసెంబ్లీ సమావేశాలను మంగళ వారం ఉదయానికి వాయిదా వేశారు.
ఇటీవల భూ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ సోమవారం అసెంబ్లీకి హాజరయ్యారు. విశ్వాస పరీక్ సందర్బంగా అసెంబ్లీలో చంపయ్ సోరెన్ మాట్లాడుతూ…. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. 2019లో హేమంత్ సోరెన్‌కు ప్రజాతీర్పు లభించిందని తెలిపారు.
అలాంటి సీఎంను భూకుంభకోణం కేసులో అరెస్టు చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో ఎప్పుడు గిరిజనులు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూసినా అప్పుడు వెంటనే ఆ నాయకత్వాన్ని అణిచి వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. హేమంత్ సోరెన్ విషయంలో ఎలాంటి అన్యాయం జరిగిందో ఈరోజు యావద్దేశ ప్రజలు చూశారని అన్నారు.