పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని సన్మానించడం గొప్ప విషయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. తాను జీవితంలో పెద్దగా అవార్డు (Awards)లను అందుకోలేదని తెలిపారు. కేంద్రం తనకు అవార్డు ఇస్తున్నామని చెబితే మోడీ మీద గౌరవంతో తీసుకున్నానని తెలిపారు. తనతో పాటు అవార్డులు పొందిన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆదివారం సన్మానించింది. సన్మానం అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ….. మట్టిలో మాణిక్యాలను గుర్తించి కేంద్రం పద్మ పురస్కారాలు ఇవ్వడం చాలా గొప్ప విషయమని వెల్లడించారు. ఇంత చక్కటి కార్యక్రమానికి నాయకత్వం వహించిన రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నట్టు చెప్పారు.
తెలుగు చిత్ర కళామ్మ తల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కండ్లు అని…. మూడో కన్ను చిరంజీవి అని కొనియాడారు. ప్రస్తుత రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయని తెలిపారు. ఆ ప్రమాణాలను చక్కదిద్దాల్సిన అవసరం మనందరి మీదా ఉందన్నారు. కొంత మంది కేవలం క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ అనే నాలుగు ‘సీ’లను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు.
బూతుల నేతలకు పోలింగ్ బూత్‌లో సమాధానం చెప్పాలని ప్రజలకు సూచించారు. నీతి, నిజాయితీ లేని వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా విలువలు పాటించాలని సూచనలు చేశారు. పట్టుదలే మనిషి జీవితాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. జీవితంలో కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని తెలిపారు.
రేవంత్ రెడ్డిని తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని వివరించారు. ఎంతో ఉత్సాహం, చురుకుదనం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని…. ఏదైనా తలుచుకుంటే దాని లోతు చూసే వరకు వదలడన్నారు. అవార్డులు పొందిన తర్వాత ఇలాంటి సన్మానాలు చేస్తే మరింత ఆనందంగా ఉంటుందని తెలిపారు. రేవంత్ రెడ్డిని అభినందిస్తూ, ఆశీర్వదిస్తున్నానన్నారు.