జాతిపిత మహాత్మ గాంధీ (Mahatma Gandhi) వర్ధంతి సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. లంగర్ హౌస్‌లోని బాపూ ఘాట్ పై పుష్ప గుచ్చాలు ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. మహాత్మ గాంధీ వర్ధంతి సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
మహాత్ముడి సిద్దాంతమే దేశానికి శ్రీ రామ రక్ష అని తెలిపారు. నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడని కొనియాడారు. అదే మార్గంలో భారతావనికి స్వాతంత్య్రం సంపాదించిన మహనీయుడు అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా ఇతర అధికారులు, కాంగ్రెస్ నేతలు మహాత్ముడికి పుష్పాంజలి ఘటించారు.
మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ ప్రసాద్, పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గాంధీజీకి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఎమ్మెల్సీల నియామకం విషయంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పై కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలను కించపర్చడం సబబు కాదని సూచించారు.
కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది కోసమే పూలే విగ్రహం ఏర్పాటు అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తీసుకు వచ్చిందని మంత్రి అన్నారు. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తమ హయాంలో అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. పూలే విగ్రహం ఏర్పాటుపై కేసీఆర్‌ను గతంలో కవిత ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు.