Telugu News » Hemanth Soren : సీఎం మిస్సింగ్… ఎమ్మెల్యేలంతా రాంచీలోనే… సతీమణికి పగ్గాలు….!

Hemanth Soren : సీఎం మిస్సింగ్… ఎమ్మెల్యేలంతా రాంచీలోనే… సతీమణికి పగ్గాలు….!

తాజాగా సోరెన్ మిస్సింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

by Ramu
Hemant Sorens wife next Jharkhand CM?

జార్ఖండ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రం సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) అందుబాటులో లేకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాజాగా సోరెన్ మిస్సింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంగా సోరెన్ భార్య కల్పనా సోరెన్ (Kalpana Soren( అధికార పగ్గాలు చేపడుతారని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

Hemant Sorens wife next Jharkhand CM?

ఇప్పటికే సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా రాజధాని రాంచీకి చేరుకోవడం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది. కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యేలంతా రాంచీలో అందుబాటులో ఉండాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యేలంతా సీఎం నివాసంలో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.

ఈ వార్తల నేపథ్యంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ట్వీట్ చేశారు. సీఎం హేమంత్ సోరెన్ పరారీలో ఉన్నారని ట్వీట్‌లో ఆరోపించారు. ఎమ్మెల్యేలందరినీ హేమంత్ సోరెన్ రాంచీకి పిలిపించుకున్నారని అన్నారు. హేమంత్ తన సతీమణి కల్పనా సోరెన్​కు సీఎం పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందన్నారు. ఈడీ విచారణకు సీఎం భయపడుతున్నారని ఆరోపించారు.

రోడ్డు మార్గంలో ఢిల్లీ నుంచి రాంచీకి వస్తానని సోరెన్ జేఎంఎం నేతలకు చెప్పినట్టు తమకు సమాచారం ఉందన్నారు. మరోవైపు సీఎం సోరెన్ కనిపించడం లేదని జార్ఖండ్ మాజీ సీఎం, రాష్ట్ర బీజేపీ చీఫ్ బాబూలాల్ మరాండి ట్వీట్ చేశారు. ఆయన కోసం ఈడీ వేట కొనసాగుతోందన్నారు. ఎవరైనా సీఎం సోరెన్ చూస్తే తమకు సమాచారం అందించాలని కోరారు.

సమాచారం అందించిన వారికి రూ. 11,000 నగదు బహుమతి అందిస్తామని వెల్లడించారు. ఇది ఇలా వుంటే మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆయన నివాసం నుంచి రూ.36 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. రెండు కార్లను సైతం సీజ్ చేసినట్లు వెల్లడించాయి.

You may also like

Leave a Comment