రాబోయే లోక్ సభ ఎన్నికలు మహాభారత యుద్ధమని బీజేపీ ఎంపీ (BJP MP) డాక్టర్ కే. లక్ష్మణ్ (K. Laxman) అన్నారు. ప్రధాని మోడీ చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారని తెలిపారు. విపక్షాల కౌరవ సైన్యంపై మోడీ నేతృత్వంలోని పాండవ సైన్యం విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. రాహుల్ భారత్ జోడో కాదు కాంగ్రెస్ జొడో చేపడితే కరెక్ట్ అని ఎద్దేవా చేశారు.
ఎన్నికల ముందే కాంగ్రెస్ చేతులు ఎత్తేసిందని అన్నారు. మూడో సారి మోడీ ప్రధాని అవుతున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై వస్తున్న ఊహగానాలపై ఆయన స్పందించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ ఎలాంటి పొత్తులూ పెట్టుకోబోదని స్పష్టం చేశారు. ఒక వేళ బీఆర్ఎస్ కాళ్ల బేరానికి వచ్చినా ఆ పార్టీతో తాము పొత్తులు పెట్టుకోబోమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 17 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందన్నారు. ఆంధ్రలో పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఏపీలో జనసేనతో పొత్తు ఉందని వెల్లడించారు. ఈ నెల 20 నుంచి మార్చి 2 వరకు విజయ సంకల్ప యాత్రలు ఉంటాయని వివరించారు. సమిష్టి నాయకత్వంలో, పార్టీ జెండా కింద ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
బీఆర్ఎస్ మునిగి పోయే నావ అని వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. బీజేపీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి రహస్య ఒప్పందం చేసుకున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాలు వస్తాయన్నారు. ఎన్డీయేకు 400 సీట్లకు పైగా సీట్లు రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ను మార్చాలనే ఉద్దేశంతోనే ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని అన్నారు.. కాంగ్రెస్ పెట్టిన బడ్జెట్‌కు పాలనకు పొంతన లేదని ఫైర్ అయ్యారు.