మహిళలకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే మహిళల కోసం కీలకమైన హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు వాటిని అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. తాజాగా మహిళలకు వడ్డీ లేని రుణాలను తిరిగి ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
త్వరలోనే డ్వాక్రా (DWACRA) మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆశా వర్కర్ల సమస్యల గురించి ఈ సందర్బంగా భట్టి వెల్లడించారు. గిరిజనుల అభివృద్ధి కోసం కూడా తమ ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు.
తమకు చాలా కాలంగా జీతాలు రావడం లేదని ఆశా వర్కర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వారికి జీతాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందజేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఆ తర్వాత విషయాన్ని విస్మరించిందని ఆరోపించారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్లు, స్వయం సహాయక బృందాలు, మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రతి నెల 1న బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.