– ఆర్టీసీ బస్సులకు దూరమౌతున్న మగ ప్రయాణికులు
– రద్దీ తట్టుకోలేక ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణాలు
– ప్రత్యామ్నాయ మార్గాలపై ఉన్నతాధికారుల ఫోకస్
– మగవాళ్లకు ప్రత్యేక బస్సుల అంశంపై చర్చలు
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి అంటారు. ఇప్పుడు తెలంగాణ (Telangana) లో మగ ప్రయాణికుల పరిస్థితి చూస్తే అలాగే ఉంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ స్కీమ్ ప్రారంభించాక అంతా మారిపోయింది. సీట్లు దొరక్క మగ ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. తమ బాధను, ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రభుత్వంపై, ఆర్టీసీ (RTC) పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ ప్రత్యామ్నాయ చర్యలకు దిగింది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మగవాళ్ల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించనున్నారనే ప్రచారం జరిగింది. ఒకప్పుడు మహిళల కోసం ఇలా సీట్లను కేటాయించారు. ఇప్పుడు మగ ప్రయాణికుల కోసం ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేయగా.. ప్రత్యేకంగా బస్సులకే ఆర్టీసీ మొగ్గు చూపినట్టు సమాచారం ఎండీ సజ్జనార్ (MD Sajjanar) ఈ విషయంపై సమావేశాలు నిర్వహిస్తున్నారు.
సమయాలను బట్టి రద్దీపై సమగ్ర సమాచారం వచ్చాక విద్యార్థులకు, మగవాళ్లకు ప్రత్యేక బస్సులు నడపడంపై ఆలోచన చేయనున్నారు. ఇది సాధ్యం కాదంటే మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇంకా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పలు రకాల ప్రత్యామ్నాయాలపై ఆర్టీసీ దృష్టి సారించింది.
ఆర్టీసీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఓఆర్ (ఆక్యూపెన్సీ రేషియో) గతంలో 69 శాతం ఉండేది. మహిళా ప్రయాణికులు నిత్యం 12-14 లక్షల మంది బస్సెక్కేవారు. ఇప్పుడు ఫ్రీ స్కీమ్ పుణ్యమా అని ఆ సంస్క్ష్ 29 లక్షలు దాటింది. ఓఆర్ దాదాపు 89 శాతం నమోదవుతోంది. ఉన్న వాహనాలతోనే అంత రద్దీని తట్టుకోవడం ఆర్టీసీకి సవాల్ గా మారింది. దీంతో ప్రత్యామ్నాయ అంశాలపై ఫోకస్ చేశారు.