తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఓటమిపాలు కావడంపై చర్చించారు. తదుపరి భవిష్యత్ కార్యచరణపై ఎలా ముందుకెళ్లాలా అని నేతలు మాట్లాడుకున్నారు.
కేటీఆర్ భేటీ తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ను కలిచేందుకు ఫాంహౌస్ కు వెళ్లారు. ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వ పనుల్లో బిజీ అవుతుండగా… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్, కేసీఆర్ వరుసగా భేటీ కావడం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయం సాధిస్తామనుకున్న బీఆర్ఎస్ కి పరాజయం ఎదురైంది. మొత్తం 119 స్థానాలకుగాను 39 నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచి అధికారానికి దూరమైంది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకుల్లో నిరాశ రాకుండా ఉండేందుకు వరుసగా కేటీఆర్, కేసీఆర్ వారిని కలిసి ధైర్యం చెబుతున్నారు.
కాంగ్రెస్ విజయం కన్ఫామ్ అయిన తర్వాత కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. ఆ తర్వాత ఫాంహౌస్ కు వెళ్లిపోయారు.