రాష్ట్రంలో యువతకు కేసీఆర్ (KCR) ఉద్యోగాలు ఇవ్వలేదని.. కేవలం ఆయన కుటుంబం సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయని ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చిన ప్రియాంక గాంధీ ఖానాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఎంతో మంది విద్యార్థులు టీఎస్పీఎస్సీ వైఫల్యం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ జాబ్ తొలగిస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని.. అందుకే కల్వకుంట్ల ఫ్యామిలీ ఉద్యోగాలను పీకేయాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ (BRS) చేయలేని పనిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసి చూపిస్తుందని తెలిపారు.
కాంగ్రెస్‌కు తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే విషయంలో విజన్ ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. ఇందిరా గాంధీ ప్రజలకు మేలు చేయాలని రాజకీయాల్లోకి వచ్చారని తెలిపిన ప్రియాంక గాంధీ.. రాజకీయాల్లోకి ఎందరో వస్తారు కానీ కొందరే గుండెల్లో నిలిచిపోతారని బీఆర్ఎస్ని పరోక్షంగా విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆదివాసీలను పోడు పట్టాల పేరుతో మోసం చేశారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలిసే సోనియా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు, కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినా ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తే ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని ప్రియాంక గాంధీ వెల్లడించారు.

రాష్ట్రాన్ని అంధకారంలోకి వెళ్ళేలా బీఆర్ఎస్ (BRS) నిర్ణయాలు ఉన్నాయని జేపీ నడ్డా మండిపడ్డారు. ఈ ఎన్నికలతో కుటుంబ పార్టీ పాలనను ఓడించకుంటే.. మరో ఐదేళ్లు ప్రజలకు కష్టాలు తప్పవని జేపీ నడ్డా అన్నారు. బీఆర్ఎస్ అంటేనే అవినీతి, రాక్షసుల పార్టీ అని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ (KCR) కుటుంబం మాత్రమే లాభపడిందని.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందకుండా కేసీఆర్ రావణుడిలా అడ్డుపడుతున్నాడాని జేపీ నడ్డా విమర్శించారు.



ఇక ఎన్నికల్లో గెలిచి ఏదో సాధిస్తానని కలలు కన్న యువకుడు అర్థాంతరంగా తనువు చాలించాడు. వారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. నిజామాబాద్ (Nizamabad) అర్బన్‌లో స్వత్రంత్ర అభ్యర్థిగా (Independent Candidate) పోటీ చేస్తున్న యమగంటి కన్నయ్య గౌడ్ ఆత్మ హత్యకు పాల్పడ్డారు. అలియాన్స్ అఫ్ డెమొక్రటిక్ రిపబ్లిక్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ఇతను నిన్న రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది.