అయోధ్య ( Ayodhya)లో ‘రామ్ లల్లా’ (Ramlalla)విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు ఇప్పటికే తేదీని ఆలయ ట్రస్టు ఖరారు చేసింది. తాజగా ప్రాణ ప్రతిష్టకు ఆహ్వాన పత్రికలను (Invitation Cards) పంపుతున్నారు. ఈ ఆహ్వాన పత్రికలను పోస్టల్ ద్వారా పంపుతున్నారు. ఆహ్వాన పత్రికలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మొత్తం 6000 మందికి ఆహ్వాన పత్రికలను పంపుతున్నట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ వంటి ప్రముఖులు ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. ట్రస్ట్ పంపిన మొదటి ఆహ్వాన లేఖ తనకు అందిందని సాధువు ఒకరు తెలిపారు. తనకు పోస్టు ద్వారా ఆహ్వాన పత్రిక అందిందన్నారు.
ఆహ్వాన పత్రం అందిన తొలి వ్యక్తిని తానే కావడం ఆనందంగా ఉందన్నారు. ఇది ఇలా వుంటే 2024 జనవరి మూడో వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ తెలిపారు. అంతకు ముందు అయోధ్యలో ఫ్లోర్ ఇన్ లే కు సంబంధించిన చిత్రాలను ట్రస్టు షేర్ చేసింది.
జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్ లల్లా విగ్రహాన్ని ప్రధాని మోడీ ప్రతిష్టించనున్నారు. మొత్తం నాలుగు దశల్లో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోడీకి ఇప్పటికే ట్రస్టు ఆహ్వానాన్ని పంపింది. ఇక ఈ వేడుక కోసం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 10 కోట్లకు పైగా కుటుంబాలను ఆహ్వానిస్తున్న ఇప్పటికే వెల్లడించింది.