అయోధ్య ( Ayodhya)లో రామ్ లల్లా (Ram Lalla) విగ్రహ ప్రతిష్టాపన సందర్బంగా వారం పాటు ఉత్సవాలను నిర్వహించాలని ట్రస్టు నిర్ణయించింది. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాముని జీవితంలోని కీలక ఘట్టాలను తెలిపే విధంగా శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ రాముని జననం నుంచి వనవాసం, రావణాసుర వధ, అయోధ్యకు పునరాగమనం వంటి కీలక ఘట్టాలను తెలిపే విధంగా విగ్రహాలు ఉంటాయని ప్రధాన శిల్పి రంజిత్ మండల్ పేర్కొన్నారు.
ఈ విగ్రహాలను తయారు చేసే అవకాశం లభించడాన్ని తాను ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పలు దశల్లో మొత్తం 100 విగ్రహాలను ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. వీటిలో ఇప్పటి వరకు 60 విగ్రహాలు సిద్ధం చేశామని వివరించారు. శోభాయాత్రలో భాగంగా 100 ఉత్సవ విగ్రహాలతో అయోధ్యలో ఊరేగింపు నిర్వహించనున్నారు. జనవరి 17 ఈ శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు.
మరోవైపు జోధ్‌పూర్ గోశాల నుంచి 10 ఎద్దుల బండ్లలో 600 లీటర్ల ఆవు నెయ్యి అయోధ్యకు చేరుకుంది. వాటికి సరయు నదిలో స్నానం చేయించారు. అనంతరం కరసేవకపురంలో ఆలయ ట్రస్టుకు నెయ్యి పంపిణీ చేశారు. ఇది ఇలా వుంటే నూతనంగా నిర్మిస్తున్న రామ మందిర గర్బ గుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. పాలరాతితో చేసిన తామరపుష్ప సింహాసనంపై రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.
జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, క్రికెటర్లు సచిన్, కోహ్లీతో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందింది. ఆలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరో మూడేండ్ల సమయం పడుతుందని శ్రీరామ జన్మభూమి ట్రస్టు కార్యదర్శి మహంత్ గోవింద్ గిరిదేవ్ వెల్లడించారు.