అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir)లో జనవరి 22న ‘రామ్ లల్లా’విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట నిర్వహించనున్నారు. ఆలయం రూపు దిద్దుకోవడంలో సోంపురా కుటుంబం (Sompura Family) ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ కుటుంబం గతంలో ఆధునిక సోమనాథ దేవాలయాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించింది. సోమనాథ ఆలయానికి సోంపురా కుటుంబానికి చెందిన ప్రభాశంకర్ ఓగద్ భాయ్ చీఫ్ ఆర్కిటెక్ట్‌గా పని చేశారు.
ప్రభాశంకర్ మనవడు ఆశీశ్ సోంపురా ప్రస్తుతం అయోధ్య రామ మందిరానికి ఆర్కిటెక్ట్ గా ఉన్నారు. రామాలయ గొప్పతనాన్ని సోంపురా వివరించారు. సుమారు 200 ఏండ్ల పాటు మనుగడ సాగించేలా ఆలయాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. సాధారణంగా 500 ఏండ్ల పాటు మనుగడ సాగించేలా పురాతన కట్టడాలను అనాలసిస్ చేసి నిర్మిస్తామన్నారు.
కానీ రామ మందిర్ విషయంలో దూరదృష్టితో ఆలోచించామన్నారు. ప్రకృతి వైపరిత్యాలు, భూకంపాలు వచ్చినా తట్టుకుని నిలబడేలా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో అయోధ్య రామాలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఉత్తర భారతం, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే నాగర శైలిలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
ఆలయంలో గర్బగుడిని అష్టభుజి ఆకారంలో తీర్చి దిద్దుతున్నామని వివరించారు. అష్టభుజి ఆకారంలో ఉండే దేవాలయాలు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. రామ మందిరం అష్టభుజి ఆకారంలో ఉందన్నారు. ఇదే ఈ ఆలయ ప్రత్యేకతన్నారు. విష్ణువుతో అష్టభుజి ఆకారం ముడిపడి ఉందన్నారు. ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలోనే ఉండటం మరో ప్రత్యేకతన్నారు.
మొత్తం 58 ఎకరాల్లో ప్రస్తుత ఆలయ సముదాయం విస్తరించి ఉందన్నారు. కాన్నీ దాన్ని 108 ఎకరాలకు విస్తరించాలని ట్రస్టు కోరుతోందన్నారు. కానీ అక్కడ తాము కేవలం ప్రాథమిక సౌకర్యాలను మాత్రమే ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామన్నారు. ఆ ప్రదేశంలో పచ్చదనంపై దృష్టి పెడతామన్నారు. ఆలయ కాంప్లెక్స్ లోపల తక్కువ భవనాలు ఉంటాయన్నారు. మ్యూజియం, పరిశోధనా కేంద్రం, ప్రార్థన మందిరం మొదలైన ఇతర సౌకర్యాలను బయట ఉంచాలనుకుంటున్నామన్నారు.