అయోధ్య ( Ayodhya) లో వచ్చే ఏడాది జనవరి 22న శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను చేయనున్నారు. ఈ క్రమంలో ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం ఆలయంలో ఫ్లోర్ (Floor Inlay) ను అత్యంత సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. తాజాగా ఆలయానికి సంబంధించిన ఫోటోలను రామ జన్మ భూమి ట్రస్టు విడుదల చేసింది. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతకు ముందు నిర్మాణంలో ఉన్న ఆలయం క్రేన్ వ్యూ, రామ జన్మభూమి ఆలయంలో జరుగుతున్న పనులకు సంబంధించి ఫోటోలు విడుదల చేసింది. వచ్చే ఏడాది రామ్ లల్ల విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. సుమారు 80,000 మంది భక్తులు బస చేసేందుకు వీలుగా టెంట్ సిటీలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు ఆహ్వానించారు. దీంతో పాటు నూతనంగా నిర్మించిన రామాలయంలో పూజలు చేసేందుకు జనవరి 26 తర్వాత ఎన్ఆర్ఐలను ఆహ్వానించాలని ట్రస్టు నిర్ణయించింది. రామ్ లల్లా ఆరాధనకు కొత్త నిబంధనలను రూపొందించారు. ఏడాది పొడవునా నిర్వహించే వివిధ కార్యక్రమాలు, వేడుకలను వివరిస్తూ వార్షిక క్యాలెండర్‌ను ఆలయ ట్రస్టు విడుదల చేసింది.
రామాలయంలో ఏడాది పొడవునా డజనుకు పైగా ఉత్సవాలు జరుగుతాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి వెల్లడించారు. వచ్చే ఏడాది రామ నవమి, ఝులన్ ఉత్సవ్, దీపావళి, వివాహ పంచమి, మకర సంక్రాంతి వేడుకలు ఉంటాయని తెలిపారు. ఏడాది పొడవునా భక్తులను ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయాలని ఈ పండుగల లక్ష్యమన్నారు.