చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్(Cm jagan)ను టీడీపీ నేత, హిందూ పురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) తీవ్రంగా విమర్శించారు. ఏం తప్పు చేశారని చంద్రబాబును జైళ్లో పెట్టారని ఆయన నిలదీశారు. ఇక నుంచి దెబ్బకు దెబ్బ తీస్తామని, వేటుకు వేటు తప్పదని తేల్చి చెప్పారు. జగన్ సీఎం కావడం ఏపీ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని అన్నారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh)తో కలిసి రాజమహేంద్ర వరంలో చంద్రబాబు(chandra babu)తో ములాఖత్ అయ్యారు. ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పులు చేసిన వాళ్లంతా ఇప్పుడు బయట వున్నారని అన్నారు.
కానీ రాష్ట్రాన్ని బాగు చేయాలని ప్రయత్నించిన చంద్రబాబు మాత్రం జైళ్లో వున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసులకు భయపడాల్సింది టీడీపీ నేతలు కాదని, భయపడాల్సింది వైసీపీ నేతలేనన్నారు. తాము భయపడే రకం కాదన్నారు. కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ మరింత బలపడుతోందని వెల్లడించారు.
రాష్ట్ర భవిష్యత్ కోసమే యుద్ధం ప్రకటించామన్నారు. జగన్ సర్కార్ పై చేస్తున్న యుద్ధంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భాగస్వామ్యం కావడం శుభపరిణామమన్నారు. తమను నైతికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తే తాము మరింతగా బలపడతామని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరి పైనా ఉందని తెలిపారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.