– దర్యాప్తు సంస్థలకు బీజేపీకి సంబంధమేంటి?
– ఎవరు తప్పు చేసినా తప్పించుకోలేరు
– కరీంనగర్ లో గంగుల గెలిచేది లేదు
– కాంగ్రెస్ అభ్యర్థికి కేసీఆర్ డబ్బులు పంపుతున్నారు
– హస్తానికి ఓటేసి గెలిపిస్తే నేతలు అమ్ముడుపోతారు
– రెండోరోజు ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్
సీఎం కేసీఆర్ (CM KCR) కు దమ్ముంటే బీసీని కానీ.. ఎస్సీ, ఎస్టీని కానీ.. అగ్రవర్ణాల్లోని పేదను సీఎం చేస్తానని ప్రకటించాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay). కాంగ్రెస్ (Congress) కూడా ఈ సవాల్ ను స్వీకరిస్తుందా? అని ప్రశ్నించారు. కేవలం పేదల గురించి ఆలోచించే పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పారు. ఎంఐఎం మద్దతుతో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈడీ లాంటి సంస్థలకు బీజేపీకి సంబంధమేంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఎవరి తప్పుంటే వాళ్లపై దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటాయని తెలిపారు.
కరీంనగర్ (Karimnagar) లో రెండోరోజు ప్రచార పాదయాత్ర చేపట్టారు సంజయ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్ ను పావుగా కేసీఆర్ వాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అంతకు రెట్టింపు కరీంనగర్ ఎమ్మెల్యేపై ఉందని తెలిపారు. కరీంనగర్ ప్రజలెవరూ మోసపోవద్దని, బీఆర్ఎస్ పాలనలో భూకబ్జాలు, మత్తు పదార్థాలు, కమీషన్ల దందాతో కరీంనగర్ అల్లాడుతున్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే అమ్ముడుపోతారని చెప్పారు సంజయ్. కేసీఆరే స్వయంగా పైసలిచ్చి కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోవడం ఖాయమని తేలిపోయిందన్నారు. ప్రజలు దయచేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చవద్దని కోరుతున్నానని తెలిపారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న బీజేపీకి ఓటేసి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే పేదల అభ్యున్నతే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా గంగులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సంజయ్. ‘‘గంగుల.. ముందు మీ స్థానమేంటో తెలుసుకో. మీకు చివరిదాకా బీఫాం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. గంగులను ఓడించేందుకు సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ ప్రజలారా… బీఆర్ఎస్ డబ్బులను వెదజల్లుతోంది. గులాబీ నేతల అరాచకాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. కరీంనగర్ ను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రజలంతా బీజేపీకి మద్దతిచ్చి గెలిపించాలి’’ అని కోరారు బండి సంజయ్.