మోడీ (Modi)లేని భారత్ (India)ను ఊహించుకోలేమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. మోడీ లేకపోతే దేశ చరిత్రను మార్చే పనులన్నీ ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గల్లీలో ఎవరున్నా.. ఢిల్లీలో మాత్రం మోడీ ప్రభుత్వమే ఉండాలని అన్నారు.
కరీంనగర్ జిల్లాలో జరిగిన నవ యువ ఓటర్ల సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ….. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కేంద్రం ముందుకు వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిరంతర పోరాటం చేసిన తనపై కేసీఆర్ సర్కార్ వందకు పైగా కేసులు పెట్టిందని చెప్పారు. అయినప్పటికీ ఎక్కడా తాను వెనుకడగు వేయలేదన్నారు.
పాసు పోర్టు కన్నా విలువైన వజ్రాయుధం ఓటు అని వెల్లడించారు. ఓటు హక్కుతో ప్రజలు తమ తలరాతతో పాటు దేశ భవిష్యత్ కూడా మార్చ వచ్చని చెప్పారు. కానీ నేటి యువత ఆశించిన స్థాయిలో ఓటు హక్కును నమోదు చేసుకోకపోవడం బాధాకరమని అన్నారు. నవ యువత ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగేందుకు కృషి చేసిన ప్రధాని మోడీని మళ్లీ పీఎంగా ఎన్నుకోవాల్సిన అవసరం యువతపై ఉందన్నారు. దేశ పునాదులు ప్రజాస్వామ్యమంపై నిలబడ్డాయని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైందన్నారు. ఓటు హక్కును ఉపయోగించుకోక పోవడం కరెక్ట్ కాదన్నారు. ఓటు అనే ఆయుధంతో అవినీతి పరులను ఊచకోత కోయండన్నారు.