మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు మంగళవారం సీఎంతో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు బయలుదేరారు. ఈ క్రమంలో జాతీయ బీజేపీ (BJP) ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi sanjay) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చూసిన బ్యారేజీనే మళ్లీ ఎన్ని సార్లు చూస్తారంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీపై అధికారులు సమగ్ర నివేదికను అందజేశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే మాజీ సీఎం కేసీఆర్పై సీబీఐతో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. కృష్ణా జలాల విషయంలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఆటలాడుతున్నాయని ఆరోపించారు.
ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, పరిపాలనను గాలికొదిలి అధికారులు ఇచ్చిన మేడిగడ్డ రిపోర్టు ఆధారంగా కేసీఆర్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తుందని నిప్పులు చెరిగారు.
ఇక్కడే బీఆర్ఎస్, కాంగ్రెస్ దోస్తీ తెలిసిపోతోందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు సక్రమంగా అటు బీఆర్ఎస్ నాయకులు నల్లగొండ సభకు, కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డకు వెళ్లారని అన్నారు.